PM Modi: మీరే నా కుటుంబం.. ఐఎన్ఎస్ విక్రాంత్‌పై నేవి సిబ్బందితో మోదీ దీపావళి వేడుకలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దీపావళిని ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకపై నేవీ సైనికులతో కలిసి జరుపుకున్నారు.సైనికులను తన కుటుంబంగా భావిస్తున్నానని, అందుకే పండుగ జరుపుకోవడానికి వచ్చానని మోదీ భావోద్వేగంగా చెప్పారు. వారి దేశభక్తి, ఉత్సాహం చూసి సంతృప్తిగా త్వరగా నిద్రపోయానని తెలిపారు.ఐఎన్ఎస్ విక్రాంత్ మన దేశ శక్తికి, ఆత్మవిశ్వాసానికి గొప్ప నిదర్శనమని ప్రధాని కొనియాడారు.

PM Modi: మీరే నా కుటుంబం.. ఐఎన్ఎస్ విక్రాంత్‌పై నేవి సిబ్బందితో మోదీ దీపావళి వేడుకలు
Pm Modi Celebrates Diwali With Navy Personnel

Updated on: Oct 20, 2025 | 11:53 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకునే తమ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించారు. సోమవారం గోవా కార్వార్ తీరంలో ఉన్న స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించిన ప్రధాని.. నేవి సిబ్బందితో కలిసి దీపాల పండుగను ఉల్లాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు.

‘‘ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో దీపావళి జరుపుకోవాలని కోరుకుంటారు. నేను మిమ్మల్ని నా కుటుంబంగా భావిస్తాను, అందుకే మీతో పండుగ జరుపుకోవడానికి వచ్చాను. ఈ దీపావళి నాకు చాలా ప్రత్యేకం” అని ప్రధాని అన్నారు. ‘‘మీతో ఇక్కడ కలిసి ఉండడం మాటల్లో చెప్పలేను. మీ ఉత్సాహం, దేశభక్తి చూశాక నాకు ఎంతో సంతృప్తి కలిగింది. సాధారణంగా త్వరగా నిద్రపోని నేను, నిన్న చాలా త్వరగా నిద్రపోయాను’’ అని మోదీ తెలిపారు. సైనికులు దేశభక్తి పాటలు పాడటం, అందులో ఆపరేషన్ సింధూర్‌ గురించి వివరించడం చూసినప్పుడు.. యుద్ధభూమిలో సైనికులు పడే కష్టాన్ని మాటలు వివరించలేవని ప్రధాని భావోద్వేగంగా చెప్పారు.

ఐఎన్ఎస్ మన దేశ శక్తి

ఐఎన్ఎస్ మన దేశ శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని ప్రధాని మోదీ కొనియాడారు. సముద్రంలో సూర్యకాంతి సైనికులు వెలిగించిన దీపాలలా ప్రకాశిస్తోందని ఆయన వారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇది కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్‌ను మోకరిల్లేలా చేసిందన్నారు. త్రివిధ దళాల మధ్య అద్భుతమైన సమన్వయం యద్ధంలో పాక్‌ను చిత్తు చేసిందన్నారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ విశేషాలు:

ఐఎన్ఎస్ విక్రాంత్ భారత రక్షణ సామర్థ్యానికి, దేశ ఆత్మనిర్భర్ శక్తికి ఒక చక్కటి నిదర్శనం. దాదాపు రూ.20,000 కోట్ల ఖర్చుతో రూపొందించిన ఈ విమాన వాహక నౌక 76శాతం స్వదేశీ కంటెంట్‌ను కలిగి ఉంది. దీనితో విమాన వాహక నౌకను దేశీయంగా రూపొందించి, నిర్మించగల ప్రత్యేక సామర్థ్యం ఉన్న దేశాల సరసన భారత్ నిలిచింది. 262 మీటర్ల పొడవు, 45,000 టన్నుల బరువుతో ఇది మునుపటి కంటే చాలా పెద్దది. ఇది మిగ్-29కె జెట్‌లు, హెలికాప్టర్లతో సహా సుమారు 30 విమానాలను మోయగలదు. 88 MW శక్తితో పనిచేసే నాలుగు గ్యాస్ టర్బైన్‌ల ద్వారా గరిష్టంగా 28 నాట్ల వేగాన్ని చేరుకోగలదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..