
ఛత్తీస్‌గఢ్‌లో ఒకవైపు వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి.. ఈ టైమ్‌లో ఛత్తీస్‌గఢ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు హోం మంత్రి అమిత్ షా రానున్నారు. మూడు రోజుల పాటు రాయ్‌పూర్‌లో మోదీ, అమిత్ షా అక్కడే బస చేయనున్నారు. ఆల్ ఇండియా డీజీపీ సదస్సును నిర్వహించబోతున్నారు. మావోయిస్టుల ఏరివేత ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం కొనసాగనుంది.
దేశవ్యాప్తంగా చట్ట-సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన అత్యంత కీలక సమావేశం నవంబర్ 28 నుంచి 30 వరకు ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగనుంది. అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు, సీనియర్ భద్రతా వ్యవస్థాధికారులు పాల్గొనే ఈ వార్షిక సమావేశంలో ఈసారి ప్రధానంగా మావోయిస్టుల నిర్మూలన, ఆపరేషన్ కగార్ పురోగతి, టెర్రరిస్ట్ దాడుల నిరోధక వ్యూహాలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి.
ఈ సమావేశానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతుండటం దీనికి మరింత ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టింది. ప్రత్యేకంగా, ముగ్గురు రోజుల పాటు రాయ్‌పూర్‌లోనే బస చేస్తూ.. భద్రతా వ్యవస్థపై సమీక్షలు, కీలక సూచనలు ఇవ్వనున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. దేశంలో అత్యంత మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ ఒకటిగా నిలుస్తుండటంతో, అక్కడే డీజీపీ సమావేశం పెట్టడమే కీలక పరిమాణం. . ఇటీవల ఆపరేషన్ కగార్‌లో భద్రతా దళాలు సాధించిన విజయాలు, ఎదురైన సవాళ్లు, భవిష్యత్ చర్యలపై ఈ కాన్ఫరెన్స్‌లో విస్తృత చర్చ జరగనుంది.
టెర్రరిజం, అంతర్గత భద్రత, క్రిమినల్ నెట్‌వర్క్‌లు, సైబర్ దాడుల వంటి అంశాలపై కూడా ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సమావేశంతో దేశ భద్రతా వ్యవస్థకు మరింత బలం చేకూర్చే విధంగా సమగ్ర వ్యూహాలు సిద్ధం అవుతాయని కేంద్రం భావిస్తోంది. ఇక మూడు రోజుల పాటు రాయ్‌పూర్ మొత్తం హై అలర్ట్‌లో ఉండనుంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వరుస మీటింగ్‌లు, డిపార్ట్‌మెంట్‌ల వారీగా రివ్యూ సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ప్రత్యేక కమాండోలు, CRPF, NIA, IB టీములు ఇప్పటికే రాయ్‌పూర్ చేరుకుని వ్యూహాత్మక భద్రతా ప్రణాళికను అమలు చేస్తున్నాయి. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల డీజీపీలు, టాప్ లా-ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులందరూ రావడంతో భద్రతను మరింత కట్టదిట్టం చేశారు.
మరి ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత అతడి స్వస్థలమైన ఛత్తీస్‌గఢ్‌లో ఈ సమావేశం జరగుుతోంది. ఇప్పటికే హిడ్మా మరణ వార్తతో శోకసంద్రంలో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీకి సైతం హిడ్మా మృతి తీరని లోటు. వచ్చే మార్చి నాటికి దేశవ్యాప్తంగా మావోయిస్టు దాడులను పూర్తిగా అణచివేయడంపై ఈ సమావేశం కీలక మార్గదర్శకాలు ఇచ్చే అవకాశముంది. ప్రత్యేకంగా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య సమన్వయం, ఇంటెలిజెన్స్ షేరింగ్, అడవుల్లో టెక్నాలజీ ఆధారిత మానిటరింగ్ వ్యవస్థల అమలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. సాటిలైట్ సర్వైలెన్స్, డ్రోన్ పెట్రోలింగ్, గ్రౌండ్ ఆపరేషన్స్‌ను మరింత సమర్థవంతంగా మార్చే విధానాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కేంద్ర భద్రతా వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..