త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని (Agnipath Scheme) నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. గత వారం రోజులుగా ఆర్మీ అభ్యర్ధులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనకారులు రైల్వే స్టేషన్లను, రైల్వే ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. మరోవైపు ఉద్రిక్త పరిస్దితుల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని చోట్ల దారి మళ్లించింది. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 800 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిలో కృష్ణా, గుంటూరు, కర్నూలు, ఒంగోలు జిల్లాల వాసులు వున్నారు. వారణాసి నుంచి బయల్దేరాల్సిన ధనాపూర్- సికింద్రాబాద్ రైలు రద్దు కావడంతో వీరంతా ఇక్కట్లు పడుతున్నారు. సొంత స్థలాలకు ఎలా వెళ్లాలో తెలియక యాత్రికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
అయితే ఈ యాత్రికులు చిక్కుకున్న సంగతి తెలిసిన వెంటనే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి(G.Kishan Reddy) స్పందించారు. యాత్రికులు ఎవరూ ఆందోళన చెందవద్దని కిషన్ రెడ్డి తన ట్విట్టర్ హాండిల్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే వారణాసి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లుగా తెలిపారు. వారికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు. ఎవరైన తెలుగు రాష్ట్రాల వారు అక్కడ చిక్కుకుంటే వెంటనే స్థానిక అధిరులను కలవాలని సూచించారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఆహార, వైద్య ఏర్పాట్లతోపాటు సొంత స్థలాలను చేరుకునేందుకు ప్రయాణ సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ వివారాలను ఆయన తన ట్విట్టర్ ఖాతో పోస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో అగ్నిపథ్ వ్యతిరేక నిరసన ఉధృతంగా జరగడంతో జిల్లాకు చెందిన 70 మంది యాత్రికులు వారణాసిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
Union Minister Shri @kishanreddybjp on hearing about pilgrims / tourists from 2 Telugu states being stranded in Varanasi, Uttar Pradesh, spoke to the District Magistrate (DM), consequently necessary food & other logistics have been arranged.
1/2— Office of G. Kishan Reddy (@KishanReddyOfc) June 19, 2022
తమను రక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యాత్రికుల ప్రకారం, వారు ఉత్తర భారతదేశంలోని యాత్రా స్థలాలను పర్యటిస్తున్నారు. వారు శనివారం తిరిగి రావాల్సి ఉంది. అయితే, నిరసనల కారణంగా రైలు సర్వీసులు రద్దు కావడంతో వారు అక్కడే ఇరుక్కుపోయారు.