ఒక చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేసేవారిని దేశద్రోహులుగానో, జాతి వ్యతిరేకులుగానో ప్రకటించజాలమని బాంబేహైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. సీఏఏకి నిరసనగా మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో ధర్నా చేసేందుకు తనను, మరికొందరిని అనుమతించాలని కోరుతూ.. ఇఫ్తేఖార్ షేక్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. ఈ ధర్నాకు బీద్ జిల్లా మేజిస్ట్రేట్, పోలీసులు అనుమతించలేదని ఆయన పేర్కొన్నారు. ఒక చట్టానికి నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేయరాదనే నిబంధనేదీ సీఏఏలో లేదని, అందువల్ల ఇందులో అవిధేయత అనే ప్రసక్తే తలెత్తదని న్యాయమూర్తులు టీ.వీ. నలవాడే, ఎం.జీ.స్యులికర్లతో కూడిన బెంచ్ పేర్కొంది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతివారికీ ఉందని, ఇలాంటివారిని దేశద్రోహులనలేమని జడ్జీలు వ్యాఖ్యానించారు.’ మనది ప్రజాస్వామ్య గణతంత్ర దేశం.. మన రాజ్యాంగం ‘రూల్ ఆఫ్ లా’ ని ఇచ్చింది గానీ.. ‘రూల్ ఆఫ్ మెజారిటీ’ ని కాదు ‘ అని వారన్నారు. అహింసాయుత ఆందోళనల వల్లే ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిందని, ఆ విషయాన్ని విస్మరించరాదని కోర్టు తెలిపింది. బీద్ జిల్లా మేజిస్ట్రేట్, పోలీసులు ఈ వ్యక్తికి అనుమతినివ్వకపోవడం చెల్లదని కోర్టు పేర్కొంటూ… ఆ ఉత్తర్వులను కొట్టివేసింది.