తల్లికి సరైన వైద్యం అందించలేదని డాక్టర్‌పై కత్తితో దాడి చేసిన యువకుడు

|

Nov 13, 2024 | 3:51 PM

చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఓ రోగి కుమారుడు వైద్యుడిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో డాక్టర్ బాలాజీ ఏడు కత్తిపోట్లకు గురయ్యారని.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తల్లికి సరైన వైద్యం అందించలేదని డాక్టర్‌పై కత్తితో దాడి చేసిన యువకుడు
Dr Balaji
Follow us on

తన తల్లికి సరిగా వైద్యం అందించలేదన్న కోపంతో ఓ యువకుడు డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. కత్తితో పొడిచి, తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. ఆంకాలజీ విభాగంలో పనిచేస్తోన్న బాలాజీ జగన్నాథన్ అనే వైద్యుడిపై ఈ దాడి జరిగింది. నిందితుడు పేషంట్‌లా వచ్చి, డాక్టర్‌ను కత్తితో పొడిచి పారిపోయేందుకు యత్నించాడు. మిగతా వైద్య సిబ్బంది అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడి తల్లి ఇదే ఆసుపత్రిలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంది. పరిస్థితి మెరుగు పడకపోవడంతో చికిత్స అందించిన వైద్యుడు బాలాజీ జగన్నాథన్‌పై ఆమె కుమారుడు కక్ష పెంచుకున్నారు. అదను కోసం ఎదురు చూసిన నిందితుడు బుధవారం ఉదయం దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వైద్యుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు ఆస్పత్రి వర్గాలు.

ఈ దాడిని తీవ్రంగా ఖండించిన వైద్యులు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు సీఎం స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన.. విచారణకు ఆదేశించారు. టైమ్‌తో సంబంధం లేకుండా సేవలు అందిస్తోన్న వైద్యుల కృషి ఎనలేనిదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ కూడా ఈ విషయంలో వేగంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇద్దరిని అరెస్టు చేశామని, ప్రమేయం ఉన్న మరికొందరిని వెంటనే అరెస్టు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారని మంత్రి తెలిపారు.

ఆసుపత్రులలో కఠినమైన భద్రతా చర్యలు, వైద్య నిపుణులపై దాడులను నివారించడానికి.. కేంద్ర, రాష్ట్ర చట్టాలను పటిష్టం చేయాలని దేశవ్యాప్తంగా వైద్యులు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ దాడితో వైద్యుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..