కేంద్ర నిఘా సంస్థ కొత్త చీఫ్‌గా ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ తపన్ కుమార్ దేకాను నియమించింది కేంద్రం. హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ అధికారి తపన్ కుమార్. అరవింద్ కుమార్ పదవీకాలం జూన్ 30తో ముగియనుండటంతో ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. తపన్ కుమార్ రెండేళ్లు పదవిలో ఉంటారు. ఇక నీతి ఆయోగ్ CEOగా పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యారు. 1981 ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన పరమేశ్వరన్ అయ్యర్ పారిశుద్ధ్య నిపుణుడిగా గుర్తింపు పొందారు. 2009లో ఐఏఎస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన..ఐక్యరాజ్యసమితిలో సీనియర్ గ్రామీణ నీటి పారుదల, పారిశుద్ధ్య నిపుణుడిగా పని చేశారు. అయ్యర్ రెండేళ్ల పాటు నీతి అయోగ్ సీఈవోగా కొనసాగనున్నారు.
జూన్ 30తో అమితాబ్ కాంత్ పదవీకాలం ముగియనుండటంతో..ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రా చీఫ్‌గా ఉన్న సమంత్ కుమార్ గోయల్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించింది. పంజాబ్ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన గోయల్ వచ్చే ఏడాది జూన్ 30 వరకు రా చీఫ్‌గా కొనసాగుతారు.
ఇక సీనియర్ ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తాను (NIA) డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుప్తా పంజాబ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్‌గా గుప్తా నియామకానికి క్యాబినేట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన మార్చి 31, 2024 వరకు పదవిలో కొనసాగనున్నారు.