అక్కడ పాన్ నమిలారా…ఫైన్ కట్టక తప్పదు…ఎక్కడో తెలుసా..?

|

Mar 05, 2020 | 5:19 PM

కొంతమందికి పాన్‌, గుట్కా వంటివి నమలడం అలవాటు. దీనివల్ల వారు తమ ఆరోగ్యాన్నే కాదు..ఇతరుల ఆరోగ్యాన్నీ పరోక్షంగా నాశనం చేస్తున్నారు. అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని అక్కడ ఆంక్షలు విధించారు.

అక్కడ పాన్ నమిలారా...ఫైన్ కట్టక తప్పదు...ఎక్కడో తెలుసా..?
Follow us on

భోజనం అయ్యాక తాంబూలం వేసుకుంటే కానీ పూర్తి అయినట్లు కాదు అంటారు మన పెద్దలు… అయితే జర్దా దట్టించిన కిళ్లీ వేసుకొని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మితే మాత్రం చిరాకే. పాన్ వేసుకునే అలవాటు ఉన్నవారు. కిళ్లీ కట్టించుకొని కర..కరా నమిలి… ఏ వీధి చివరో లేదంటే కరెంటు స్థంభం వద్దో, గోడల మీద, ఫుట్ పాత్ మీద, అందులేదు…ఇందు లేదు అన్నట్లు అన్ని చోట్ల పాన్ ఉమ్మేసి ఎర్రటి మరకలు పడేలా చేస్తుంటారు. అయితే ఈ అలవాటు మంచిది కాదని, జబ్బులు వ్యాపిస్తాయని చెప్పినా ఎవరూ వినరు. ఇచ్చట పాన్ ఊయరాదు అని సైన్ బోర్డు తగిలించినా పట్టించుకునే నాథుడే ఉండరు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ఓ దేవస్థానం అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

కొంతమందికి పాన్‌, గుట్కా వంటివి నమలడం అలవాటు. దీనివల్ల వారు తమ ఆరోగ్యాన్నే కాదు..ఇతరుల ఆరోగ్యాన్నీ పరోక్షంగా నాశనం చేస్తున్నారు. అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న పూరీ ఆలయంలో ఆంక్షలు విధించారు. జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరం లోనికి కిళ్లీ తింటూ ఎవరైనా ప్రవేశిస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆలయ పాలకమండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. జగన్నాథుని దేవస్థానం ప్రాంగణంలో కిళ్లీ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది. పాన్ నములుతూ ఆలయంలోకి ప్రవేశిస్తే రూ.500 జరిమానా విధిస్తామని ప్రకటించింది. జిల్లా కలెక్టరేట్‌ సమన్వయంతో దేవస్థానం ప్రాంగణంలో కిళ్లీ నిషేధం పట్ల కార్యాచరణ ఖరారు చేశారు.

అయితే, గతంలోనే దేవస్థానం ప్రాంగణంలో కిళ్లీ ఉమ్మడం నివారించాలని ఆదేశాలు జారీచేశారు. అయినా కొందరు పాన్ నములుతూనే ఆలయంలోకి వస్తున్నారు. దీంతో ఈసారి పాలక మండలి ఘాటుగా స్పందించింది. పూర్తి స్థాయి నిషేధానికి నడుం బిగించింది. జరిమానా భారీగా విధిస్తేనే కార్యాచరణ సాధ్యం అవుతుందని పలు వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరోవైపు శ్రీ మందిరం ప్రాంగణం పరిసరాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్నికూడా పూర్తిగా నిషేధించాలని పాలక మండలి నిర్ణయించింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ కార్యచరణ అమలు అవుతుందని జగన్నాథ ఆలయ సీఏఓ కిషన్‌ కుమార్‌ తెలిపారు.