పొరుగునున్న అన్ని దేశాలతో సత్సంబంధాలను కోరుతున్నామని పాకిస్తాన్ దౌత్యాధికారి అఫ్తాబ్ హాసన్ ఖాన్ తెలిపారు. ఇండియాలో ప్రస్తుతం తాత్కాలిక పాక్ హైకమిషన్ హెడ్ గా ఉన్న ఆయన.. జమ్మూ కాశ్మీర్ పై పాక్-భారత్ మధ్య గల వివాదం చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని అన్నారు. 70 ఏళ్లుగా ఈ వివాదం ఉభయ దేశాల మధ్య సాగుతోందని, అయితే శాంతి, సామరస్యాలతో, సౌహార్ద పూరిత వాతావరణంలో దీన్ని సాల్వ్ చేసుకోవచ్చునన్నారు. 1960 నాటి ఇండస్ వాటర్ ట్రెటీ (ఒప్పందం) కింద శాశ్వత ఇండస్ కమిషన్ ఏర్పాటుపై ఢిల్లీలో ఉభయదేశాల మధ్య జరుగుతున్నసమావేశం నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. రెండున్నర సంవత్సరాల తరువాత ఈ సమావేశం జరుగుతోంది.పుల్వామా దాడి అనంతరం, ఆ తరువాత బాలాకోట్ వైమానిక దాడి ఘటనతో భారత-పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు చాలావరకు క్షీణించాయి.
పైగా జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్నీ బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడంతో దీనిపై పాక్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇది కాశ్మీరీల స్వయం నిర్ణయాధికారాన్ని హరించడమే అని ఆరోపించింది. అయితే ఇండియా పాక్ తీరును గర్హిస్తూ ఇది మా దేశ ఆంతరంగిక వ్యవహారమని, ఇందులో మీ జోక్యం అనవసరమని ఖండించింది. అటు- ఇటీవల ఉభయ దేశాల మిలిటరీ అధికారులు హాట్ లైన్ ద్వారా చర్చించుకుని కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలూ కట్టుబడి ఉండాలని నిర్ణయించడంతో పరిస్థితి కొంత చల్లబడింది. కానీ కాశ్మీర్ లో పాక్ ఉగ్రవాదుల చొరబాట్లు మాత్రం ఆగడం లేదు. ఈ నెల21 న షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు పాక్ టెర్రరిస్టులు మరణించారు. అంతకు ముందు కూడా ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
మరిన్ని చదవండి ఇక్కడ :సూపర్ మార్కెట్ లో చిలిపిదొంగ..పట్టపగలు అందరూ చూస్తుండగానే దొంగతనం..వైరల్ అవుతున్న వీడియో..:Bird thief video.