Pakistan PM Letter to Modi: పాకిస్తాన్ కొత్త ప్రధాని షాబాజ్ షరీఫ్(Shehbaz Sharif) శనివారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) లేఖకు సమాధానం పంపారు. భారత్ పాక్ రెండు దేశాల మధ్య శాంతి సహకారాన్ని పెంపొందించుకోవాలని పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ ఉద్ఘాటించారు. దీంతో పాటు, రెండు దేశాల మధ్య సామాజిక, ఆర్థిక అభివృద్ధి గురించి ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన అవసరముందన ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
పాకిస్తాన్ ప్రధానిగా షాబాజ్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు రోజుల క్రితం ఆయనకు ప్రధాని మోదీ లేఖ రాశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలుపుతూ.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. షాబాజ్ షరీఫ్‌కు ఆయన చేసిన ట్వీట్‌లో శుభాకాంక్షలు కాకుండా, చర్చల కోసం ఉగ్రవాద రహిత వాతావరణాన్ని సృష్టించడం గురించి ఈ లేఖలో ప్రధాని ప్రస్తావించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారతదేశం కూడా పేదరికంతో సహా ఇతర సమస్యలపై మాట్లాడాలని, కలిసి వ్యవహరించాలని కోరుకుంటోందని ప్రధాని లేఖ రాశారు.
ఇమ్రాన్ ఖాన్ తర్వాత పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధినేత షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 23వ ప్రధానమంత్రి అయ్యారు. షాబాజ్ షరీఫ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు. ఇమ్రాన్ ఖాన్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుండి తొలగించారు. పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించిన మొదటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కావడం విశేషం. ఇమ్రాన్ ఖాన్ 2018 ఆగస్టు 18న పాకిస్తాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతను 10 ఏప్రిల్ 2022 వరకు 1,332 రోజుల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. మూడు సంవత్సరాల ఏడు నెలల 23 రోజుల పాటు ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కొనసాగారు.