Pakistan: కాశ్మీర్‌ పాకిస్థాన్ జీవనాడి.. పాక్‌ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు

కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ పాకిస్థాన్‌కు జీవనాడి వంటిది..దాన్ని పాకిస్థాన్ నుంచి ఎవరూ వేరు చేయలేరని అన్నారు. రెండు-దేశాల సిద్ధాంతాన్ని సమర్థిస్తూ, హిందువులు, ముస్లింల మధ్య మతం, సంస్కృతి, ఆలోచనలు వేరుగా ఉన్నాయని, అందుకే పాకిస్థాన్ ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.

Pakistan: కాశ్మీర్‌ పాకిస్థాన్ జీవనాడి.. పాక్‌ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు
Pakistan Army Chief

Updated on: Apr 17, 2025 | 3:18 PM

విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయుల సమావేశంలో ప్రసంగించిన జనరల్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ఉన్న వారంత దేశ రాయబారులని.. ఉన్నతమైన భావజాలం.. సంస్కృతికి చెందినవారన్న విషయాన్ని మరిచిపోకూడదని ఆయన అన్నారు. దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతగానో పోరాటం చేశారని తెలిపారు. దేశంతో వారి బంధం బలహీనపడకుండా ఉండేందుకు మీ పిల్లలకు పాకిస్థాన్ చరిత్రను తెలియజేయాలన్నారు. హిందువులతో పోలిస్తే.. తాము భిన్నమైన వారని.. తమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆశయాలు అన్ని భిన్నంగా ఉంటాయని తెలిపారు. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసిందని అసిమ్ మునీర్ అన్నారు.

ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్‌కు పెట్టుబడులు రాకపోవచ్చని చాలామంది భయపడుతున్నారని జనరల్ మునీర్ అన్నారు.  13 లక్షల భారత సైనికులే పాకిస్థాన్‌ను భయపెట్టలేకపోయారని.. అలాంటిది ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని మీరు భావిస్తున్నారా..? అని కీలక వ్యాఖ్యలు చేశారు. బలూచిస్తాన్‌లో వేర్పాటువాద ఉద్యమాలపై సాయుధ దళాలు కఠినంగా వ్యవహరిస్తాయని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. కాశ్మీరీ ప్రజల స్వీయ నిర్ణయ హక్కు కోసం పాకిస్థాన్ తన మద్దతును కొనసాగిస్తుందని, ఐక్యరాష్ట్ర సమితి తీర్మానాలకు అనుగుణంగా వారి పోరాటానికి రాజకీయ, దౌత్యపరమైన సహకారం అందిస్తుందని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….