
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 28 మంది మరణించిన తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వానికి ప్రతి చర్యలోనూ మద్దతు ఇస్తామని చెప్పాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది నాయకులు కూడా భారతదేశానికి మద్దతుగా నిలిచి ఈ సంఘటన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడుతున్నారు. దీంతో పాకిస్తాన్‌కు ఇప్పుడు గడ్డు రోజులు మొదలయ్యాయని స్పష్టమవుతుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తర్వాత.. జపాన్ ప్రధాని, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని మోడీతో మాట్లాడారు. దీనితో పాటు ఈ ఇరువురు దేశ నాయకులు భారత ప్రబుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాము అన్ని విధాలా సహాయం అందిస్తామని చెప్పినట్లు సమాచారం.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో చేసిన పోస్ట్ లో డజన్ల కొద్దీ అమాయక పౌరుల మరణానికి దారితీసిన విషాదకర సంఘటన ఉగ్రవాదుల పిరికి చర్యని చెప్పారు. ఈ ఉగ్రవాద దాడి గురించి తాను తన సహచరుడు నరేంద్ర మోడీతో ఇప్పుడే మాట్లాడానని చెప్పారు. ఈ దుఃఖ సమయంలో ఫ్రాన్స్ భారతదేశ ప్రజలకు దృఢంగా అండగా నిలుస్తుంది. అవసరమైన ప్రాంతాల్లో ఫ్రాన్స్, దాని మిత్రదేశాలతో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుందని చెప్పారు,
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ఫోన్ చేసి పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. బాధితులకు ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదంపై భారత్ చేసే పోరాటంలో ఇటలీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.
జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా కూడా ప్రధాని మోడీకి ఫోన్ చేసి జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని సమర్థించలేమని ఆయన అన్నారు. ఉగ్రవాదం మానవాళికి తీవ్రమైన ముప్పు అని నొక్కిచెప్పారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మే వారు ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పారు. సరిహద్దు వద్ద ఉగ్రవాదులు చేసే దాడిపై తమ అంచనాలను, దానిని దృఢంగా, నిర్ణయాత్మకంగా ఎదుర్కోవాలనే భారతదేశ సంకల్పాన్ని ప్రధానమంత్రి మోడీ జపాన్ ప్రధానితో పంచుకున్నారు.
అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ మాట్లాడుతూ.. భారతదేశానికి అమెరికా అన్ని విధాలా అండగా నిలుస్తుందని, అన్ని ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఇదే విషయంపై అధ్యక్షుడు ట్రంప్ , కార్యదర్శి రూబియో స్పష్టం చేసినట్లు చెప్పారు. ఈ దారుణమైన చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకురావాలని తాము కోరుతున్నామని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..