ఈ ఏడాది పాకిస్తాన్ 2,050 కి పైగా కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడిందని కేంద్రం ఆరోపిస్తోంది. ఈ రెచ్ఛగొట్టుడు, కవ్వింత చర్యలపట్ల ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ నిర్వాకం కారణంగా 21 మంది మృతి చెందారని, పలువురు గాయపడ్డారని కేంద్ర వర్గాలు తెలిపాయి. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఎన్నిసార్లు ఆ దేశాన్ని కోరినా పట్టించుకోలేదని కేంద్ర హోం శాఖ పేర్కొంది. కాశ్మీర్ విషయంలో భారతదేశం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని పాక్.. ఐక్యరాజ్యసమితిలో ఆరోపించిన విషయం విదితమే.. జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితిపై ‘ దర్యాప్తు ‘ జరిపించాలని కూడా ఐరాస లోని మానవ హక్కుల మండలిని పాక్ మంత్రి షా మహ్మద్ ఖురేషీ కోరారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఇండియా.. నిజానికి క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి పాకిస్తాన్ పాల్పడుతోందని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని యధేచ్చగా అతిక్రమిస్తోందని ప్రత్యారోపణ చేసింది. నియంత్రణ రేఖ వద్ద భారత దళాలు అత్యంత సంయమనంతో వ్యవహరిస్తుండగా.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దొంగచాటుగా కాశ్మీర్లోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారని భారత హోం శాఖ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే మానవ హక్కుల అతిక్రమణ జరుగుతోందన్నారు. ఈ ఏడాది జరిగినన్ని ఉల్లంఘనలు మరే ఏడాదీ జరగలేదని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై సమయం వచ్చినప్పుడల్లా పొరుగునున్న ఈ దేశం ముఖ్యంగా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి ఇండియాను అప్రదిష్టపాల్జేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఒక్క చైనా తప్ప, అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాలు భారత్ కు బాసటగా నిలుస్తున్నాయి. పాకిస్తాన్ మొదట తన సొంత గడ్డపై గల ఉగ్రవాద శిబిరాలను కట్టడి చేయాలని సూచిస్తున్నాయి. కరడు గట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ ని అరెస్టు చేసినట్టే చేసి… అతడిని .విడుదల చేసిన వైనాన్ని ఈ దేశాలు గుర్తు చేస్తున్నాయి.