ASHA Worker: చేసే పనిని అంకిత భావంతో చేస్తే.. గుర్తింపు అదే వస్తుంది.. దీనికి ఒడిశాకు చెందిన ఒక గిరిజన ఆశా వర్కర్ సజీవ సాక్ష్యం. ఈ ఆశా వర్కర్ చేసిన పని గుర్తింపు లభించి ఫోర్బ్స్ ఇండియా డబ్ల్యు-పవర్ 2021 జాబితాలో చోటు దక్కింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలోని బరాగావ్ తహసీల్‌లోని గర్గద్‌బహల్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల మటిల్డా కుల్లు అనే మహిళ గత 15 సంవత్సరాల నుండి ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు. మటిల్డా కుల్లుని ఆశా దీదీ అని కూడా పిలుస్తారు. కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మటిల్డా కుల్లు ప్రజలకు కోవిడ్-19 విషయంలో అవగాహన కల్పిస్తున్నారు. కోవిడ్ 19 సోకితే తీసుకోవాల్సిన చికిత్స, జాగ్రత్తల గురించి ప్రజల్లో మటిల్డా కులు అవగాహన కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించారు.
ఫోర్బ్స్ ఇండియా డబ్ల్యు-పవర్ 2021 జాబితాలో మటిల్డా కుల్లు కాకుండా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య కూడా ఉన్నారు. ఈ ఏడాది జాబితాలో 21 మంది మహిళలు ఉన్నారు. అయితే ఆశా వర్కర్ గా పనిచేస్తూ నెలకు రూ. 4,500 జీతం తీసుకుంటున్న మటిల్డా కుల్లు కూడా ఈ ఫోర్బ్స్ లో చోటు లభించింది. అంతేకాదు బరాగావ్ తహసీల్‌లోని 964 మంది ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది.
ఆశా దీదీ దైనందిన జీవితం రోజు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. తన ఇంటి పనులను పూర్తి చేసుకుని.. తన ఫ్యామిలీలో నలుగురుకి ఆహారం సిద్ధం చేస్తుంది. తనకు ఉన్న నాలుగు పశువులను మేపుతుంది. తన గ్రామం మొత్తాన్ని తన కుటుంబంగా భావిస్తుంది. మటిల్డా కుల్లు ఆశా వర్కర్‌గా ఉద్యోగంలో చేరిన మొదట్లో గ్రామస్థులకు అనారోగ్యం ఏర్పడితే..డాక్టర్ వద్దకు వెళ్లకుండా మంత్రగత్తె వద్దకు వెళ్లడం గమనించారు. దీంతో ప్రజలలో వైద్యం పట్ల అవగాహన కలిగించడం మొదలు పెట్టారు. ఆమె కృషి ఫలించింది. గ్రామస్తుల్లో మార్పు వచ్చింది. తమకు ఏ విధమైన వ్యాధులు కలిగినా వెంటనే వైద్యుల వద్దకు వెళ్తున్నారు.
ఇక ఆశా దీదీ ప్రతిరోజూ గ్రామంలో సైకిల్‌పై ఇంటింటికీ తిరుగుతూ ప్రజల నుండి ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని తెలుసుకుంటారు. దీంతో పాటు నవజాత, కిశోర బాలికలకు వ్యాధి నిరోధక టీకాలు వేయడం, గర్భణీ స్త్రీల కు పౌష్టికాహారం తదితర అంశాలపై గ్రామస్థులకు సలహాలు ఇస్తారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో, మటిల్డా కులు కోవిడ్-19 వ్యాక్సినేషన్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. కోవిడ్ -19 పరీక్షలను నిర్వహించడానికి ఆమె ప్రతిరోజూ 50-60 ఇళ్లను సందర్శించేది. వృద్ధ మహిళలు, పురుషులను టీకాలు వేసేందుకు టీకా కేంద్రాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. తాను ఆశా వర్కర్ చేస్తున్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. తన కృషి చాలామంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడిందని చెప్పారు మటిల్డా కుల్లు.
Also Read: రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్న ఉల్లిపంట.. చెన్నై మార్కెట్ లో 500 క్వింటాళ్ళ ఉల్లి పశువుల పాలు..