North Inida: ఉత్తరాదిలో వరదల బీభత్సం..12 మంది మృతి.. 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం..

|

Jul 10, 2023 | 7:42 AM

ఉత్తరభారతాన్ని వరదలు ముంచెత్తాయి. ఢిల్లీలో 42 ఏళ్ల వర్షపాతం రికార్డు బద్దలయ్యింది. భారీవర్షాలతో 12 మంది చనిపోయారు. హిమాచల్‌లో కుంభవృష్టితో జనజీవితం స్తంభించింది. ఢిల్లీలో సోమవారం స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. జమ్ము లోని పూంచ్‌ సరిహద్దులో వరదల కారణంగా ఇద్దరు జవాన్లు చనిపోయారు.

North Inida: ఉత్తరాదిలో వరదల బీభత్సం..12 మంది మృతి.. 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం..
North India Floods
Follow us on

ఉత్తరభారతం వరదల ధాటికి విలవిలలాడుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌ లోని మండి జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 40 ఏళ్ల నాటి స్టీల్‌ బ్రిడ్జి వరదల ధాటికి కుప్పకూలింది. వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బియాస్‌ నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో ఆట్‌ – బంజర్‌ ప్రాంతాలను కలుపుతూ  బియాస్‌ నదిపై ఉక్కు వంతెన నిర్మించారు. ఈ వంతెనపై జనం రాకపోకలను సాగిస్తున్నారు. అయితే తాజాగా కురుస్తున్న వర్షాలతో బియాస్ నదిలో వరద ఉధృతి పెరిగింది. ఈ వరద ఉధృతికి ఉక్కు వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది

హిమాచల్‌ లోని కులూలో పలు వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో భారీవర్షాల కారణంగా మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. బియాస్‌ నది ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్రంలో 9 జిల్లాల్లో రెడ్‌అలర్ట్‌ జారీచేసింది వాతావరణశాఖ .కులూలో వరదప్రవాహంలో చిక్కుకున్నవాళ్లను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తాళ్ల సాయంతో కాపాడారు.

హిమాచల్‌లో వరదల బీభత్సంపై సీఎం సుఖ్విందర్‌సింగ్‌ సుక్కు అత్యవసర సమీక్ష నిర్వహించారు. నదీ తీర ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లవద్దని , ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు సుక్కు . ఈ రోజు మరో 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు నదీతీర ప్రాంతాలకు వెళ్లరాదు. ఇళ్ల లోనే ఉంటే మంచిది. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం.. ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూస్తామని చెప్పారు. మరోవైపు హిమాచల్‌లో భారీ వర్షాల కారణంగా హిమాచల్‌లో కరెంట్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కమ్యూనికేషన్‌ వ్యవప్థ కూడా డ్యామేజ్‌ కావడంతో యుద్దప్రాతిపాదికన మరమ్మతు పనులు చేపట్టారు. హిమాచల్‌ 14 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 600 రహదారులను మూసేశారు. రాంపూర్‌ జిల్లాలో నత్పా డ్యాం నిండిపోయింది . దీంతో అధికారులు అధికారులు డ్యాం నుంచి 1500 క్యూసెక్కుల నీటిని సట్లజ్‌ నదిలోకి వదిలారు. భారీ వర్షాలు, వరద నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

పంజాబ్‌లో వరదలు బీభత్సం సృష్ఠిస్తున్నాయి.హోషియార్‌పూర్‌ , తరన్‌తరన్‌తో పాటు పలు జిల్లాలు నీట మునిగాయి. వందలాది ఇళ్ల లోకి వరదనీరు చేరడంతో జనం నానా తంటాలు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోట్ల సాయంతో వరదబాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

హోషియార్‌పూర్‌ లోని ఓ హౌసింగ్‌ సోసైటీ లోకి వరదనీరు చేరింది. సెల్లార్లు నీట మునిగాయి. దీంతో జనం నానాతంటాలు పడ్డారు. కార్లు నీట మునగడంతో యాజమానులు లబోదిబోమంటున్నారు. వరదనీటిలో చిక్కుకున్న కార్లను బయటకు తీయడానికి ఓనర్లు అష్టకష్టాలు పడ్డారు. భారీవర్షాల కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు . సిమ్లాతో పాటు పట్టణాల్లో చాలా ఇళ్లు కుప్పకూలాయి.

పంజాబ్‌ లోని తరన్‌తరన్‌లో కొద్దినెలల క్రితమే నిర్మించిన వంతెన కుప్పకూలింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జకీర్‌పుర్‌ పట్టణం కూడా నీట మునిగింది. అపార్ట్‌మెంట్ల లోకి వరదనీరు చేరింది. వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

గుజరాత్‌ లోని పలు ప్రాంతాలో వరద ఉధృతి కొనసాగుతోంది. గోండాల్‌ డ్యామ్‌ నిండిపోవడంతో వరదనీరు ఇళ్ల లోకి చేరింది. బిపర్‌జాయ్‌ తుఫాన్‌ తరువాత గుజరాత్‌లో ఇంకా వరదల భీభత్సం కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా , జమ్మూ కశ్మీర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వేర్వేరు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తరాదిలో భారీవర్షాల కారణంగా 20 రైళ్లను కూడా రద్దు చేశారు. ఢిల్లీలో కుంభవృష్టి కారణంగా జనజీవితం స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందు పడుతున్నారు.

ఢిల్లీలో వరదల బీభత్సంపై సీఎం కేజ్రీవాల్‌ సమీక్ష నిర్వహించారు.  ఈ రోజు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో మంత్రి అతిషి పర్యటించారు. భారీవర్షాల కారణంగా ఢిల్లీలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది. అటు ఈశాన్యంలో కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి. అసోంలో బ్రహ్మపుత్ర నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. గౌహతి తో పాటు పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్‌ జారీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..