Piyush Goyal: దేశంలో గడిచిన 22 నెలల్లో జరిగిన రైలు ప్రమాదాల్లో ఒక్క ప్రయాణికుడు కూడా మృతి చెందలేదని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. దేశంలో గత ఆరేళ్లలో భద్రతకు అధిక నిధులు కేటాయించామని అన్నారు. 2019 మార్చి 22 జరిగిన రైలు ప్రమాదంలో చివరి ప్రయాణికుడు మరణించారని, అప్పటి నుంచి గత 22 నెలల్లో ఒక్క ప్రయాణికుడు కూడా మరణించలేదని స్పష్టం చేశారు. రైలు బ్రిడ్జీల మరమ్మతులు, నిర్వహణపై తాము ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. వర్షాకాలానికి ముందు, తర్వాత వంతెనలు, రోడ్డు ఓవర్ బ్రిడ్జీల ఇన్ స్పెక్షన్ చేస్తున్నామని అన్నారు.
భద్రతకు ప్రాధాన్యమిచ్చేలా రైల్వే బోర్డులో మొట్టమొదటిసారి సేఫ్టీ డైరెక్టర్ జనరల్‌ను నియమించామని మంత్రి గోయల్ రాజ్యసభలో వెల్లడించారు. రైల్వే ప్రయాణికుల కోసం మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. అలాగే మరిన్ని రైళ్లను నడిపేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. మున్ముందు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.