Prashant kishor: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండటరంటారు. ఈరోజు పొగిడిన వాళ్లే రేపు విమర్శిస్తారు. ఈరోజు ఛీ కొట్టిన వాళ్లే రేపు పొగుడుతారు ఇవన్నీ కామన్.. బీహార్ లో ఇప్పుడు ఇవే పాలిటిక్స్ నడుస్తున్నాయి. గతంలో బీహార్ సీఏం నితీష్ కుమార్ ని కీర్తించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. ప్రస్తుతం నితీష్ కుమార్ పై నిప్పులు చెరుగుతున్నారు. 2024లో ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ పోటీచేస్తారనే గ్యారంటీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చస్త్రశారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలను విడిచిపెట్టే నితీష్ కుమార్ మరోసారి ఆర్జేడీ వీడి మరోపార్టీతో పొత్తుపెట్టుకోరనే గ్యారంటీ లేదన్నారు. బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)తో తెగతెంపులు చేసుకుని, తేజస్వి యాదవ్ నేతృత్వంలోని RJD, కాంగ్రెస్ తో కలిసి ‘మహాఘట్ బంధన్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత JDU నేత నితీష్ కుమార్ ఎనిమిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ఆగస్టు 10వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆతర్వాత నుంచి నితీష్ పై ప్రశాంత్ కిశోర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీహార్ సీఏం సుఖంగా లేరని, అందుకే తన ప్రయోజనాల కోసం ఒక రాజకీయ పార్టీతో పొత్తు తెంచుకుని.. మరో పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. నితీష్ కుమార్ ప్రభావం ప్రస్తుతం బీహార్ కే పరిమితమని వ్యాఖ్యానించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో విపక్ష పార్టీల నాయకులను నితీష్ కుమార్ కలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తారని, విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఈనేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు ఆసక్తిరేపుతున్నాయి. మరోవైపు నితీష్ కుమార్ పై ప్రశాంత్ కిశోర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల నితీష్ కుమార్ జాతీయస్థాయిలో ఎటువంటి ప్రభావం చూపబోరని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. దీనిపై నితీష్ కుమార్ స్పందిసస్తూ ప్రశాంత్ కుమార్ నిశ్చేష్టుడయ్యాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన ప్రశాంత్ కిశోర్ ఎప్పటికప్పుడు పార్టీలు మారే బీహార్ సీఏం ఇతరులకు సర్టిఫికెట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. అతడొక వృద్ధ నాయకుడని ఘాటుగా స్పందించారు. బీహార్ అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని కౌంటర్ ఇచ్చారు. బీహార్ లో నితీష్ కుమార్, ప్రశాంత్ కిశోర్ లు గత కొద్దిరోజులుగా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..