బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. మమతకు తగిలిన గాయాలు కేవలం యాక్సిడెంట్ అని వివరించింది. నందిగ్రామ్ ఘటనపై ఇద్దరు ప్రత్యేక పరిశీలకులు సమర్పించిన నివేదికను ఈసీ కూలంకషంగా పరిశీలించింది. ఈ ఉదంతం కేవలం యాక్సిడెంటల్ అని, ఎటాక్ జరిగినట్టు తాము భావించడంలేదని ఈ పరిశీలకులు తమ నివేదికల్లో వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం నందిగ్రామ్ లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం మమతా బెనర్జీ సాయంత్రం తిరిగి కోల్ కతా వెళ్లేందుకు తన కారు వద్దకు వెళ్తుండగా గాయపడ్డారు. అయితే ఆమె కారు డోర్ విసురుగా ఆమె కాలికి తగిలిన కారణంగానే ఆమె గాయపడ్డారని ఈసీ పంపిన అబ్జర్వర్లు వివరించారు. వీరు స్వయంగా నందిగ్రామ్ వెళ్లి అక్కడ మమత గాయపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. నందిగ్రామ్ ఘటనలో మమత కాలితో బాటు మోచేయి, మెడకు కూడా గాయాలయ్యాయి.
అటు తనపై ఎటాక్ జరిగినట్టు దీదీ కూడా ప్రకటించలేదు. నందిగ్రామ్ ఘటనలో దురదృష్టవశాత్తూ తను గాయపడ్డానని, అయితే తమ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టే ఎలాంటి చర్యలకూ దిగరాదని ఆమె హాస్పిటల్ బెడ్ పై నుంచే విడుదల చేసిన వీడియో మెసేజ్ లో కోరారు. ఇలా ఉండగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మమత.. వీల్ చైర్ లోనే ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈమెపై దాడి జరిగినట్టు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేతలు ఈసీని డిమాండ్ చేశారు. నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి తన ప్రచారాన్ని ప్రారంభించారు. మమత ఆడిన నాటకాన్ని ఈసీ బట్టబయలు చేసిందని ఆయన అన్నారు. ఇక్కడి ప్రజలకు ఏది అబద్ధమో, ఏది సత్యమో తెలిసిపోయిందన్నారు. కాగా బెంగాల్ ఎన్నికలు 8 దశల్లో జరగనున్నాయి. ఈ నెల 27 మొదటి దశ ఎన్నికలతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
మరిన్ని చదవండి ఇక్కడ : సింహం ప్రాంక్ వీడియో వైరల్.. నిజం తెలిసి నవ్వులే నవ్వులు..! Viral Video