డ్రోన్లతో ఉగ్రదాడులకు ప్లాన్.. భయంకర కుట్రను బయటపెట్టిన ఎన్ఐఏ..

ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో సంచనలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హమాస్ తరహాలో దేశంపై డ్రోన్ దాడులకు విద్యావంతులైన ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది. సాంకేతిక నిపుణులు, వైద్యులతో కూడిన ఈ నెట్‌వర్క్‌ పన్నాగాన్ని దర్యాప్తు అధికారులు బట్టబయలు చేశారు.

డ్రోన్లతో ఉగ్రదాడులకు ప్లాన్.. భయంకర కుట్రను బయటపెట్టిన ఎన్ఐఏ..
Nia Uncovers Hamas Style Drone Terror Plot

Edited By: Krishna S

Updated on: Nov 18, 2025 | 4:39 PM

మనిషి తన సౌలభ్యం కోసం నిత్యం అనేక ఆవిష్కరణలు చేస్తుంటాడు. ఆ క్రమంలో వచ్చిన డ్రోన్లు మానవాళికి ఎన్నో రంగాల్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. అయితే అవే ఆవిష్కరణలు విధ్వంసాలకు, నేరాలకు సైతం ఉపయోగపడుతుంటాయి. గనుల్లో కార్మికుల కష్టాన్ని తగ్గించాలి అన్న సదుద్దేశంతో డైనమైట్ వంటి పేలుడు పదార్థాల ఆవిష్కరణ జరిగితే, ఆ తర్వాతి కాలంలో బాంబుల తయారీకి ఈ ఆవిష్కరణ మార్గం చూపింది. డ్రోన్ల విషయంలోనూ అదే జరుగుతోంది. యుద్ధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటి మానవాళికి హానిచేసే పనుల్లోనూ డ్రోన్లను విరివిగా వినియోగిస్తున్నారు.

ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు కేసు దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో విస్తుబోయే విషయాలు బయటపడ్డాయి. కారు బాంబు పేల్చిన సూసైడ్ బాంబర్ డా.ఉమర్ ఉన్ నబీకి సహకరించినవారిపై దృష్టి పెట్టిన NIA, తొలుత వైట్ కోట్ టెర్రరిస్టుకు సహకరించిన అమీర్ రషీద్ అలీని అరెస్టు చేసింది. అమీర్‌ను పాటియాలా హౌజ్ కోర్టులో హాజరుపరిచి 10 రోజుల కస్టడీకి అనుమతి తీసుకుంది. సరిగ్గా ఇదే సమయంలో ఇంకో బృందం ఇదే నెట్‌వర్క్‌కు చెందిన మరో వ్యక్తిని శ్రీనగర్‌లో అరెస్ట్ చేసింది. అతని పేరు జాసిర్ బిలాల్ వాని అలియాస్ డానిష్. నిజానికి ఈ మాడ్యుల్ మొత్తం వైద్యులు, ఇంజనీర్లు వంటి ఉన్నత విద్యావంతులతో నిండిపోయిన విషయం తెలిసిందే. వైట్ కోట్ టెర్రరిస్టులు, టెర్రర్ డాక్టర్లుగా వ్యవహరిస్తున్న ఈ ఉగ్రమూకలో తాజాగా అరెస్టయిన డానిష్ ద్వారా ఓ భయంకర కుట్ర బయటపడింది.

హమాస్ తరహా డ్రోన్ దాడులు

ఎర్రకోట వద్ద జరిగిన కార్ బాంబ్ పేలుడు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఈ తరహా పేలుడు దేశంలో గతంలో ఎప్పుడూ జరగలేదని ఇప్పటికే తేల్చారు. ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన శాంపిళ్లను విశ్లేషించగా.. అమ్మోనియం నైట్రేట్‌తో పాటు TATP వంటి ప్రమాదకర పేలుడు పదార్థాన్ని సైతం వినియోగించినట్టు గుర్తించారు. ఈ తరహా బాంబులను పశ్చిమ, మధ్య ఆసియా దేశాల్లోని ఉగ్రవాదులు, తిరుగుబాటు గ్రూపులు వినియోగిస్తున్నాయి. ఇజ్రాయెల్ దేశంపై పాలస్తీనాకు చెందిన హమాస్, లెబనాన్‌కు చెందిన హెజ్బుల్లా గ్రూపులతో పాటు ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉదంతాలను యావత్ ప్రపంచం చూసింది. వాయుమార్గం వచ్చే మిస్సైళ్లను గాల్లోనే నిర్వీర్యం చేసే పటిష్టమైన ఐరన్ డోమ్ వ్యవస్థను సైతం చేధించుకుని ఈ డ్రోన్లు ఆ దేశంలో విధ్వంసం సృష్టించాయి. కొన్ని డ్రోన్లను యాంటీ-డ్రోన్ వ్యవస్థ ద్వారా ఆ దేశం అడ్డుకుంది. తాజాగా జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ భారత్ కొన్ని దాడులకు డ్రోన్లను వినియోగించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు సైతం డ్రోన్ల ద్వారా భారీ విధ్వంసాలకు కుట్ర పన్నారు. అందులో డానిష్ వంటి సాంకేతిక నిపుణులు, డా. షాహీన్, డా. ముజమ్మిల్, డా. ఉమర్ వంటి వైద్య నిపుణులు తమ మేథస్సును విధ్వంసాల కోసం ఉపయోగిస్తున్నారు.

భద్రతా బలగాల అప్రమత్తత, తెలుగు ఐపీఎస్ అధికారి డా. సందీప్ చక్రవర్తి చాకచక్యం కారణంగా ఈ టెర్రర్ మాడ్యూల్‌ను ముందుగానే పసిగట్టి ఫరీదాబాద్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ.. అప్పటికే జరిగిన ఆలస్యం ఫలితంగా ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు జరిగింది. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిళ్లను సేకరించే క్రమంలో ప్రమాదావశాత్తూ నౌగాం పోలీస్ స్టేషన్ పేలి పలువురు పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీస్ ఫొటోగ్రాఫర్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

సమన్వయంతో అన్ని విభాగాలు.. రాష్ట్రాలు

తొలుత జమ్ము-కాశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో ఈ మొత్తం మాడ్యూల్‌ను వెంటాడడం మొదలైంది. అక్కడ దొరికిన తీగను లాగుతూ మొదట డా.ఆదిల్, డా.ముజమ్మిల్ అరెస్టయ్యారు. వైద్యులు ఏకే 47తో పాటు దొరికిపోవడంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన జమ్మూ కశ్మీర్ పోలీసులు.. హర్యానా పోలీసులతో కలిసి ఫరీదాబాద్‌లో ఏకంగా 2,900 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీ ఎర్రకోట వద్ద కార్ బాంబు పేలడంతో.. జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు హర్యానా, ఢిల్లీ, యూపీ పోలీసులు దర్యాప్తులో భాగమై ఉగ్ర డొంకను బయటకు లాగుతున్నారు. కేసు విస్తృతిని దృష్టిలో పెట్టుకుని NIAని కేంద్రం రంగంలోకి దించగా.. ఆదివారం అమీర్ రషీద్ అలీ, సోమవారం డానిష్‌లను వరుసగా అరెస్టు చేసింది.

డానిష్ ఇచ్చిన సమాచారంతోనే హమాస్ తరహా డ్రోన్ల కుట్ర బహిర్గతమైంది. డానిష్‌ను వెంటనే శ్రీనగర్ నుంచి ఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించిన అధికారులు, మంగళవారం పాటియాలా హౌజ్ కోర్టులో హాజరిపరిచారు. అతడిని న్యాయస్థానం 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇప్పటికే ఎన్ఐఏ కస్టడీలో ఉన్న అమీర్‌ను దర్యాప్తు అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఈ ఇద్దరు నిందితులతో పాటు ఇప్పటికే జమ్మూ కశ్మీ పోలీసులు, హర్యానా పోలీసులు, ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఉగ్రవాదులు ఇచ్చే సమాచారంతో ఉగ్ర కుట్రలను ముందే పసిగట్టి నిర్వీర్యం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.