Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. లోయలో ఇటీవల కాలంలో మైనార్టీలు, వలస కార్మికులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 11 మంది సామాన్య ప్రజలు ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్(ULF) ప్రకటించుకుంది. వలస కూలీలు వెంటనే కశ్మీర్ వదిలి వెళ్లిపోవాలని తాజాగా యూఎల్‌ఎఫ్ ఓ లేఖను సైతం విడుదల చేసింది. ముస్లింల హత్యలకు ప్రతీకారంగా ఈ దాడులు చేస్తున్నట్లు పాకిస్తాన్ ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మైనారిటీల భద్రతకు.. పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. ఈ హత్యల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఈ ఘటనల వెనుక ఉన్న కుట్రను వెలికితీయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఎన్‌ఐఏని ఆదేశించింది. దీంతో స్థానిక పోలీసులు విచారిస్తున్న ఈ కేసులు ఎన్‌ఐఏ పరిధిలోకి రానున్నాయి.
ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకొని వచ్చిన వారిపై ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వరుసగా హత్యలు చేస్తున్న ఉగ్రవాదులు.. ఆదివారం మరో ఇద్దరు వలస కార్మికులను చంపారు. అమాయకులు సాధారణ ప్రజలే లక్ష్యంగా జరిగిన దాడుల్లో మరణించిన పౌరుల సంఖ్య 11కు చేరింది. ఆదివారం కుల్గాంలోని వానిపోహ్ వద్ద వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు స్థానికేతరులు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
అంతకు ముందు కశ్మీర్ లోయలోని శ్రీనగర్‌లో పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగించే అరబింద్ కుమార్ షా (బిహార్), పుల్వామాలో సిరాజ్ అహ్మద్ అనే కార్పెంటర్ (ఉత్తరప్రదేశ్)ను ఉగ్రవాదులు దారుణంగా చంపారు. ఇప్పటివరకు మరణించిన వారిలో ఐదుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారుండగా.. మిగతావారు కాశ్మీరి పండిట్లు ఉన్నట్లు పేర్కొంటున్నారు.
Also Read: