
మూడు ముళ్ల బంధం, నూరేళ్ల జీవితం అంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ యువతి ఆశలు నెల తిరగకుడానే అడియాశలయ్యాయి. వివాహమై కేవలం 27 రోజులు గడవకముందే నవవధువు ఐశ్వర్య (26) అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ ఘటన కర్ణాటకలోని నెలమంగళ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. నాగమంగళకు చెందిన మమత, కృష్ణమూర్తి దంపతుల కూతురు ఐశ్వర్యకు, మల్లసంద్ర నివాసి లిఖిత్ సింహాతో గత నెలలో ఘనంగా వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినప్పటికీ పెళ్లైన కొద్దిరోజుల నుండే ఐశ్వర్యకు వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్తగారి వేధింపుల గురించి ఐశ్వర్య తన తల్లిదండ్రులకు చెప్పుకుని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసింది.
ఐశ్వర్య వైవాహిక జీవితంలో తలెత్తిన గొడవలను పరిష్కరించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు రాజీ సమావేశం నిర్వహించారు. అంతా సర్దుకుంటుందని భావించి ఐశ్వర్యను అత్తగారింటికి పంపారు. అయితే అదే రోజు సాయంత్రం లిఖిత్ సింహా తన అత్తగారికి ఫోన్ చేసి.. ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది అని సమాచారం అందించాడు. ఐశ్వర్య తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఆమె మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, తలుపులు పగలగొట్టకుండానే లోపల ఉన్న శవం వద్దకు భర్త ఎలా వెళ్ళాడని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లిఖిత్ సింహానే తన కూతురును గొంతు పిసికి చంపి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఉరి వేసి ఉండవచ్చని ఐశ్వర్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఐశ్వర్య భర్త లిఖిత్ సింహాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాకే ఇది హత్యా లేక ఆత్మహత్యా అనేది స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.
కన్న కూతురి అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.