NEET-UG Paper Leak Case: నీట్ పేపర్ లీకేజీ కేసులో దూకుడు పెంచిన సీబీఐ.. జర్నలిస్ట్ అరెస్ట్..

|

Jun 29, 2024 | 3:11 PM

వైద్యవిద్యలో ప్రవేశాలకు సంబంధించిన నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారం.. యావత్‌ దేశాన్ని కుదిపేస్తోంది. పరీక్షలు నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మీద విమర్శలు వెల్లువెత్తాయి. తమ పిల్లల భవిష్యత్‌ ప్రమాదంలో పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే.. విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నాయి. దీనిపై పార్లమెంట్ లోనూ చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి..

NEET-UG Paper Leak Case: నీట్ పేపర్ లీకేజీ కేసులో దూకుడు పెంచిన సీబీఐ.. జర్నలిస్ట్ అరెస్ట్..
NEET-UG Paper Leak Case
Follow us on

వైద్యవిద్యలో ప్రవేశాలకు సంబంధించిన నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారం.. యావత్‌ దేశాన్ని కుదిపేస్తోంది. పరీక్షలు నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మీద విమర్శలు వెల్లువెత్తాయి. తమ పిల్లల భవిష్యత్‌ ప్రమాదంలో పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే.. విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నాయి. దీనిపై పార్లమెంట్ లోనూ చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.. సంచలనంగా మారిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది.. తాజాగా.. నీట్‌ యూజీ పేపర్‌లీక్‌ కేసులో జార్ఖండ్‌ జర్నలిస్ట్‌ ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.. శనివారం జమాలుద్దీన్‌ అన్సారీని అరెస్ట్‌ చేసిన CBI అధికారులు అతన్ని విచారిస్తున్నారు. శుక్రవారం ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ప్రిన్సిపల్, వైస్‌ప్రిన్సిపల్‌ను అరెస్టు చేసిన తర్వాత.. జర్నలిస్ట్ ను అదుపులోకి తీసుకున్నారు. హజారీబాగ్‌ నగరంలో నీట్‌ పరీక్ష నిర్వహణకు స్థానిక ఒయాసిస్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఎహ్సానుల్ హక్ సమన్వయకర్తగా వ్యవహరించారు. వైస్‌ప్రిన్సిపల్‌ ఇంతియాజ్‌ ఆలం ఎన్‌టీఏ అబ్జర్వర్, ఒయాసిస్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం సమన్వయకర్తగా వ్యవహరించారని.. అధికారులు వెల్లడించారు. వారిద్దరిని పూర్తిస్థాయిలో ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేశారు. ఇదే కేసులో జిల్లాకు చెందిన మరో అయిదుగురిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో వారు ఇచ్చిన వివరాల ఆధారంగా.. జార్ఖండ్‌ జర్నలిస్ట్‌ జమాలుద్దీన్‌ అన్సారీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

కేసులో ఇప్పటికే అరెస్టైన హజారీబాగ్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ ఈ ఇద్దరు నిందితులకు జర్నలిస్ట్‌ జమూలుద్దీన్‌ సహకరించాడని CBI పేర్కొంది.. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి గుజరాత్‌లోని ఏడు చోట్ల CBI సోదాలు నిర్వహించింది.. ఆనంద్‌, ఖేడా, అహ్మదాబాద్‌, గోద్రా జిల్లాల్లో తనిఖీలు చేశారు. నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ కేసులో ఇప్పటివరకూ 6 FIRల నమోదుచేశారు.

కాగా.. జూన్ 27న ఈ కేసులో సీబీఐ తొలి అరెస్టు చేసింది . పాట్నాకు చెందిన ఇద్దరు అరెస్టయిన నిందితులు అశుతోష్ కుమార్, మనీష్ కుమార్ ను అరెస్టు చేశారు. పరీక్షకు హాజరైన వారిలో కొందరికి లీక్ అయిన నీట్ ప్రశ్నపత్రం, సమాధానాల కీలను ఇచ్చినట్లు తేలడంతో వారిని అరెస్టు చేశారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణను కేంద్ర ఏజెన్సీకి అప్పగిస్తామని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఒక రోజు తర్వాత జూన్ 23న సీబీఐ ఎఫ్‌ఐఆర్ ను నమోదుచేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..