
అధికార, విపక్ష కూటములు పోటాపోటీగా ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా ఒకే రోజు బలప్రదర్శన చేపట్టిన రెండు కూటములు గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. కొన్నేళ్లుగా తెరమరుగైన ఎన్డీఏకు మళ్లీ జీవం పోసిన కమలనాథులు.. తాజాగా ఎన్డీఏ ఎంపీలను గ్రూపులుగా విభజించి వారికి ఎన్నికల బాధ్యతలను అప్పగిస్తున్నారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే రంగంలోకి దిగి ఎన్డీఏ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. జులై 25 నుంచి ఆగస్టు 3 వరకు ప్రధాన మంత్రి ఎన్డీఏ ఎంపీల గ్రూపులతో ప్రతి రోజూ సమావేశం కానున్నారు. మొత్తం 10 గ్రూపులుగా విభజించి, ప్రతి రోజూ 2 గ్రూపులతో ప్రధాని భేటీ అయ్యేలా కార్యక్రమం ఖరారైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారికి విజయమంత్రాన్ని అందించనున్నారు. విపక్షాల ఐక్యత కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనే వ్యూహాలు, ప్రణాళికలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లను, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా సరిదిద్దాల్సిన అంశాలను గుర్తించి ప్రజలకు చేరువయ్యేందుకు చేయాల్సిన పనులపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఎన్డీఏ ఉమ్మడి ఎజెండా ఖరారు చేసే విషయంపై గురువారం కీలక సమావేశం జరిగింది. ఇందులో అరడజనుకు పైగా కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకత్వానికి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాతనే ఎన్డీఏ ఎంపీలతో గ్రూపులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది.
మిషన్ 2024 కోసం ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్లో ఉన్న ఎన్డీఏ ఎంపీలతో 10 గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రూపులో 35 నుంచి 40 మంది ఎంపీలు ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి బృందంతో విడివిడిగా సమావేశమవుతారు. భౌగోళికంగా, ప్రాంతాలవారిగా గ్రూపులను విడగొట్టారు. మొదటి సమావేశం టీమ్ ఉత్తర్‌ప్రదేశ్, టీమ్ నార్త్ ఈస్ట్‌తో జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ప్రధాని ఈ బృందాలతో భేటీ కానున్నారు. తద్వారా ఎంపీలు కూడా పనిగట్టుకుని ఢిల్లీకి రావాల్సిన అవసరం లేకుండా, అందరూ సమావేశాల కోసం ఢిల్లీలో అందుబాటులో ఉన్నప్పుడే మిషన్ 2024 లక్ష్యాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానితో పాటు సమావేశంలో పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా హాజరవుతారని పార్టీ వర్గాల సమాచారం. కేంద్ర మంత్రులు సమన్వయ బాధ్యతలు చేపడతారని తెలిసింది. టీమ్ యూపీ బాధ్యత సంజీవ్ బల్యాన్, అజత్ భట్‌లకు ఇచ్చారని, పార్టీ తరఫున తరుణ్ చుగ్, రితురాజ్ సిన్హా కూడా టీమ్-యూపీ బాధ్యతల్లో భాగస్వాములవుతారని సమాచారం.
2024లో కూడా వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న కమలనాథులు, ఏడాది కంటే తక్కువ ఉన్న ఈ సమయాన్ని పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వినియోగించనున్నారు. ఈ క్రమంలో కూటమిని బలోపేతం చేసేందుకు జులై 18న ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్నాళ్లుగా కూటమికి దూరమైన పాత మిత్రులు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా సహా మరికొందరిని అక్కున చేర్చుకున్నారు. ఇదివరకు ఎప్పుడూ ఎన్డీఏ కూటమిలో లేని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి చీలిక వర్గమైన అజిత్ పవార్ కూడా ఇప్పుడు ఎన్డీఏలో కీలకం కానున్నారు. శివసేన చీలిక వర్గం, ఎన్సీపీ చీలిక వర్గానికి చెందిన ఎంపీలు సైతం తాజా కసరత్తులో భాగమై ఎన్నికల విధులు, బాధ్యతలు అందుకోనున్నారు.
మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తున్న కమలనాథులు ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల మధ్య సమన్వయం కోసం కన్వీనర్లను కూడా నియమించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ప్రాంతాలవారిగా తూర్పు, ఈశాన్య, దక్షిణ, ఉత్తర, మధ్య, పశ్చిమ భారతదేశాలకు విడివిడిగా కన్వీనర్లను నియమించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దక్షిణ భారతదేశ ఎన్డీఏ కన్వీనర్‌గా పవన్ కళ్యాణ్‌ను నియమించనున్నట్టు జనసేన వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇదే సమయంలో తమిళనాడుకు చెందిన ఎన్డీఏ పక్షాలు అన్నాడీఎంకే నేత, మాజీ సీఎం పళనిసామిని దక్షిణభారతదేశ ఎన్డీఏ కన్వీనర్‌గా చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో దక్షిణభారత దేశంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక పార్టీ జనసేన ఉండగా, తమిళనాడు నుంచి అన్నాడీఎంకేతో పాటు మరో 6 చిన్న పార్టీలు ఉన్నాయి. కర్ణాటక నుంచి ఒక్క పార్టీ కూడా లేదు. కేరళ నుంచి కేరళ కాంగ్రెస్ చీలిక వర్గం ఎన్డీఏలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ పార్టీల మధ్య సమన్వయం చేసే బాధ్యత ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..