లేటరల్ ఎంట్రీపై యూ-టర్న్.. అసలు ఈ విధానం ఎప్పుడొచ్చింది? తాజా వివాదం ఏంటి?

| Edited By: Srikar T

Aug 20, 2024 | 6:41 PM

లేటరల్ ఎంట్రీ (Lateral Entry) విధానంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విపక్షాలతో పాటు స్వపక్షంలోనూ వ్యతిరేకత వ్యక్తమవడంతో యూ-టర్న్ తీసుకోక తప్పలేదు. ఈ విధానం ద్వారా పరోక్షంగా రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారని రాహుల్ గాంధీ మొదలుపెట్టిన విమర్శలు వివాదానికి కారణమయ్యాయి.

లేటరల్ ఎంట్రీపై యూ-టర్న్.. అసలు ఈ విధానం ఎప్పుడొచ్చింది? తాజా వివాదం ఏంటి?
Upsc
Follow us on

లేటరల్ ఎంట్రీ (Lateral Entry) విధానంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విపక్షాలతో పాటు స్వపక్షంలోనూ వ్యతిరేకత వ్యక్తమవడంతో యూ-టర్న్ తీసుకోక తప్పలేదు. ఈ విధానం ద్వారా పరోక్షంగా రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారని రాహుల్ గాంధీ మొదలుపెట్టిన విమర్శలు వివాదానికి కారణమయ్యాయి. ప్రతిపక్షాలు ఎలాగూ వ్యతిరేకిస్తాయి. అయితే అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ విధానాన్ని సమర్థించినప్పటికీ.. జేడీ(యూ), లోక్‌జనశక్తి పార్టీ (LJP)లు మాత్రం ఈ నియామకాలను తప్పుబట్టాయి. ప్రజలకు మెరుగైన పాలన, సేవల్లో నాణ్యత పెంపొందించేందుకు ఈ తరహా నియామకాలు ఉపయోగపడతాయని తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడగా.. ఇలాంటి నిపుణుల నియామకాల్లో రిజర్వేషన్ విధానం లేకపోవడం వల్ల సామాజిక న్యాయం దెబ్బతింటుందని జేడీ(యూ), ఎల్జేపీ నేతలు అభిప్రాయపడ్డారు.

చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, ఆయన సామాజిక న్యాయం ప్రతి చోటా ఉండాలని కోరుకుంటారని చెబుతూనే.. లేటరల్ ఎంట్రీ నోటిఫికేషన్‌పై పునరాలోచించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తప్పనిసరి అని, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. జేడీ(యూ) అధికార ప్రతినిధి కేసీ త్యాగి సైతం ఈ విధానంపై విమర్శలు చేశారు. తాము రామ్ మనోహర్ లోహియా అనుచరులమని, రిజర్వేషన్ల ద్వారానే పదవుల భర్తీ జరపాలని అన్నారు. ప్రజలు శతాబ్దాలుగా సామాజికంగా వెనుకబడ్డారని, ఈ స్థితిలో ప్రభుత్వం ఎందుకు మెరిట్ కోసం చూస్తోందని ప్రశ్నించారు. ఈ నిర్ణయం అధికారపక్షాన్ని వ్యతిరేకించే శక్తులకు ఆయుధాన్ని ఇచ్చినట్టుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెనక్కి తగ్గారు. ఆయన ఆదేశాల మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) శాఖ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ ప్రకటన వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశించారు.

ఇంతకీ లేటరల్ ఎంట్రీ అంటే ఏంటి?

కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి పదవుల్లో ఆయా రంగాల్లో నైపుణ్య కొరత పాలనలో ఇబ్బందికరంగా మారుతోంది. సాధారణంగా ఆలిండియా సర్వీసెస్ (IAS, IFS, IRS, IPS.. తదితర సర్వీసులు) అధికారులు కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత పదవులు పొందుతారు. అయితే కొన్ని శాఖల్లో ఆ రంగానికి అవసరమైన నైపుణ్యాలు సదరు బ్యూరోక్రాట్లలో కొరవడుతున్నాయి. ఇదిలా ఉంటే.. అసలు బ్యూరోక్రాట్ల కొరత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని వేధిస్తోంది. వివిధ శాఖలు, విభాగాల్లో మొత్తం 1,500 మంది ఐఏఎస్ అధికారుల కొరత ఉందని కేంద్ర ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడంలో లేటరల్ ఎంట్రీ విధానం తక్షణావసరాలను తీర్చుతుందని భావించింది. అయితే ఈ కొరత ఇప్పటిదేమీ కాదు. గత 2 దశాబ్దాలుగా ఉన్న ఈ కొరతను అధిగమించేందుకు 2004-2009 మధ్యకాలంలో నాటి UPA ప్రభుత్వం లేటరల్ ఎంట్రీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 2005లో ఏర్పాటైన “సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ (ARC)” ఈ విధానాన్ని సమర్థించింది. పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు జరపాలంటూ ప్రతిపాదించింది. 2017లో ఈ కమిషన్ సిఫార్సులను నీతి ఆయోగ్ సైతం ‘లేటరల్ ఎంట్రీ’ ద్వారా వివిధ రంగాల నిపుణులను కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవచ్చంటూ సిఫార్సు చేసింది. ఆ ప్రకారం ఏదైనా రంగంలో నైపుణ్యం కల్గిన కార్పొరేట్ లేదా నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (NGO)లో పనిచేసిన నిపుణులను కేంద్ర ప్రభుత్వం ‘కాంట్రాక్ట్’ పద్ధతిలో తీసుకోవచ్చు. తొలుత మూడేళ్ల పాటు, ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించే పద్ధతిలో ఈ నియామకం జరుగుతుంది. ఈ విధానం ద్వారా 2018 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలోని వేర్వేరు మంత్రిత్వ శాఖల్లో 63 మంది నియమితులయ్యారు. వారిలో కొందరు పదవీకాలం పూర్తిచేసుకున్న తర్వాత తొలగిపోగా, ప్రస్తుతం 57 మంది ఆయా పదవుల్లో కొనసాగుతున్నారు.

నిర్దేశించిన రంగాల్లో నైపుణ్యం, అనుభవం (Proven track record) ఉన్నవారిని మాత్రమే ఈ విధానం ద్వారా నియమిస్తారు. అందుకే ఇందులో రిజర్వేషన్ల ప్రస్తావన లేదు. లేటరల్ ఎంట్రీ కింద నియామకం జరిపే ప్రతి పోస్టు “సింగిల్ పోస్ట్”గా పరిగణిస్తున్నందున రిజర్వేషన్లు వర్తించవు. అదే ఇక్కడ వివాదానికి కారణమైంది.

యూపీఎస్సీ ప్రకటనలో ఏముంది?

కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలు, విభాగాల్లో మొత్తం 45 ఖాళీలు (జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు) భర్తీ చేయడం కోసం యూపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ఇందులో ప్రతి పదవికి విడివిడిగా నోటిఫికేషన్ ఇచ్చింది. ఒకవేళ అన్నింటినీ కలిపి ఒకే గ్రూపుగా పరిగణలోకి తీసుకుని ఉంటే.. SC, ST, OBC, EWS వంటి రిజర్వేషన్లను వర్తింపజేయాల్సి వచ్చేది. అలా చేయకపోవడం వల్ల రిజర్వేషన్ల ప్రస్తావన లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ప్రతి ఒక్క పోస్టుకు నియామకం చేపట్టాల్సి ఉంటుంది. పూర్తిగా మెరిట్ ఆధారంగా, పారదర్శక విధానాల్లో యూపీఎస్సీ ఈ నియమకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈలోగా ఇది రాజకీయ వివాదంగా మారడంతో ప్రధాన మంత్రి వెంటనే ఆ నియామక ప్రక్రియను నిలుపుదల చేయాల్సిందిగా డీవోపీటీ మంత్రిని ఆదేశించారు. ఆ మేరకు ప్రధాని కార్యాలయ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్, యూపీఎస్సీ చైర్‌పర్సన్‌ ప్రీతి సూదన్‌కు లేఖ రాశారు.

ఆ లేఖలో గత ప్రభుత్వాలు ఎలాంటి విధానాలు అనుసరించాయన్న అంశాలను కూడా పొందుపరిచారు. 2005లో వీరప్ప మొయిలీ నేతృత్వంలోని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ చేసిన సిఫార్సులు, 2013లోని 6వ పే కమిషన్ సిఫార్సుల మేరకే ఈ నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. లేటరల్ ఎంట్రీ విధానంలో గతంలోనూ, ప్రస్తుతం కూడా హై-ప్రొఫైల్ నియామకాలు జరిగాయని పేర్కొన్నారు. గతంలో UIADI (ఆధార్ సంస్థ)తో పాటు వివిధ శాఖల్లో కార్యదర్శి పదవులను ఎలాంటి రిజర్వేషన్లు అమలు చేయకుండా నియమించారని గుర్తుచేశారు. అంతేకాదు, అప్పట్లో ‘నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ (NAC)’ పేరుతో ఉన్న సంస్థలో సభ్యులు ప్రధాని కార్యాలయాన్ని నడిపేవారని కూడా లేఖలో ప్రస్తావించారు. 2014కు ముందు వరకు జరిగిన లేటరల్ ఎంట్రీ నియామకాలన్నీ తమకు నచ్చినవారికి పదవులు కట్టబెట్టిన చందంగానే సాగాయని, తాము మాత్రం పూర్తిగా పారదర్శకంగా, సంస్థాగతంగా ఈ నియామకాలు చేస్తున్నామని వివరించారు. అయితే ‘లేటరల్ ఎంట్రీ’ విధానంలో జరిపే నియామకాల్లో సైతం రాజ్యాంగం ప్రతిపాదించిన సమానత్వం సూత్రం ఆధారంగా సామాజిక న్యాయం, రిజర్వేషన్లు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారని చెప్పారు. నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు తగిన ప్రాతినిథ్యం ఉండాలన్నది ప్రధాని ఆకాంక్షగా వివరించారు. అయితే ఇప్పటికే జారీ చేసిన ప్రకటనలు సింగిల్ క్యాడర్ (రిజర్వేషన్లు వర్తింపజేయని) పోస్టులు కావడంతో ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని మంత్రి జితేంద్ర సింగ్ లేఖలో కోరారు. అంతేకాదు, ఈ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చి సామాజిక న్యాయం, రిజర్వేషన్లు కల్పించేలా చూడాలని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..