ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో.. ప్రహ్లాద్ జోషి నివాసంలో NDA ఫ్లోర్ లీడర్స్ కీలక మీటింగ్

ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ ఎన్డీఏ తన వ్యూహాన్ని మరింత వేగవంతం చేసింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు యూనియన్ మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో ఎన్డీఏ ఫ్లోర్ లీడర్స్ మీటింగ్ జరగనుంది. ఎన్నికల ఇంచార్జ్‌గా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టగా.. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు ఏకగ్రీవ మద్దతు సాధించడమే లక్ష్యంగా కూటమి కసరత్తులు కొనసాగిస్తోంది.

ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో.. ప్రహ్లాద్ జోషి నివాసంలో NDA ఫ్లోర్ లీడర్స్ కీలక మీటింగ్
Pralhad Joshi

Updated on: Aug 18, 2025 | 4:43 PM

 

NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు ఫుల్‌స్టాప్‌ పడింది. NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపికచేస్తూ నిర్ణయం తీసుకుంది బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు. ఇక ఈ ఎన్నిక నేపథ్యంలో అధికార కూటమి NDA కీలక సమావేశంకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో NDA ఫ్లోర్ లీడర్స్ మీటింగ్ జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యూహం, అభ్యర్థి రాధాకృష్ణన్‌కు ఏకగ్రీవ మద్దతు సాధించే ప్రయత్నాలు, మిత్రపక్షాల సమన్వయం, విపక్షాలకు నచ్చజెప్పే చర్యలు వంటి అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి ఎన్నికల ఇంచార్జ్‌గా నియమించారు. ఆయన ఇప్పటికే విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి మద్దతు కోరగా… త్వరలో మరిన్ని పార్టీల నేతలతోనూ సంప్రదింపులు జరపనున్నారు.

ఇక సోమవారం ఉదయం పార్లమెంట్‌లో జరిగిన మరో కీలక సమావేశానికి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఇందులో జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేంద్ర యాదవ్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. NDA అభ్యర్థి విజయంపై సందేహం లేకపోయినా, ఏకగ్రీవమే ప్రధాన లక్ష్యంగా కూటమి నేతలు కసరత్తులు కొనసాగిస్తున్నారు.

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌కు ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో తనను ఎంపిక చేసిన ప్రధాని, ఇతర ఎన్డీఏ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు రాధాకృష్ణన్‌. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.