Coronavirus: కరోనా రిటన్స్.. దేశంలో NB.1.8.1, LF.7 వేరియంట్స్‌ గుర్తింపు

కనుమరుగై పోయిందనుకుంటున్న వేళ కరోనా రీ ఎంట్రీ మళ్లీ కలకలం రేపుతోంది. కొత్త రూపంలో పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులే అందుకు నిదర్శనం. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణాల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. కరోనా రెండు కొత్త వేరియంట్‌లను ఇండియన్‌ జీనోమిక్స్‌ కన్సార్టియం నిపుణులు గుర్తించారు.

Coronavirus: కరోనా రిటన్స్.. దేశంలో NB.1.8.1, LF.7 వేరియంట్స్‌ గుర్తింపు
Virus
Image Credit source: NIAID

Updated on: May 24, 2025 | 5:44 PM

భారత్‌లో కోవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్‌.7లను గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం తాజాగా తెలిపింది.  దేశంలోనే అత్యధికంగా కేరళలో కరోనా ఇన్‌ఫెక్షన్లు వెలుగులోకి వస్తున్నాయి. కేరళలో 200మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దాంతో.. ఆస్పత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం. మహారాష్ట్రలోనూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క ముంబైలోనే ఈ నెలలో 95 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కర్నాటకలో 35 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో 24 గంటల్లో 23 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అవుతుండగా.. నోయిడాలో తొలి కరోనా కేసు రికార్డ్‌ అయింది. గాజియాబాద్‌లో ఇప్పటికే 4 కేసులు నమోదు అయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ కరోనా కలవరం మొదలైంది. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. బాధితుడిలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు గుర్తించారు. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. గాంధీ ఆస్పత్రిలో 25 పడకల వార్డును సిద్ధం చేసింది. కరోనా, సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర సమీక్షనిర్వహించారు. జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.. పెద్ద ప్రమాదం లేదని అధికారులు వివరించారు. అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామంటూ మంత్రికి అధికారులు తెలిపారు. కరోనాతో పాటు సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి దామోదర ఆదేశించారు. సరిపడా మందులను కూడా అందుబాటులో ఉంచాలన్నారు.

ఏపీని కూడా కరోనా కేసులు టెన్షన్‌ పెడుతున్నాయి. విశాఖలో 2 కరోనా కేసులు, కడపలో రెండు కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అలెర్ట్‌ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. విశాఖ జీజీహెచ్‌లో కరోనా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.

ఇక.. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలెర్ట్‌ చేసింది. ముందు జాగ్రత్తగా ఆస్పత్రులు సిద్ధం చేయాలని ఆదేశించింది. అయితే.. ఆయా రాష్ట్రాల్లోని కరోనా బాధితులకు కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..