
నాగ్‌పూర్, జనవరి 22: నాగ్‌పూర్‌కి చెందిన ఓ కాలేజీ విద్యార్థిని (23) ఉన్నట్లుండి తన ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. పోలీసులతో సహా అందరూ తొలుత దీనిని ఆత్మహత్యగా భావించారు. అయితే విచారణలో మృతురాలి పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతొ నాగ్‌పూర్ పోలీసులు పొరుగింట్లో ఉన్న 38 ఏళ్ల శేఖర్ అజబ్‌రావ్ ధోరేపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
షేర్ ట్రేడింగ్‌లో కోచింగ్ తీసుకుంటున్న బీఏ విద్యార్థిని ప్రాచీ హేమరాజ్ (23) బుధవారం తన బెడ్‌రూమ్‌లో ఉరివేసుకుని కనిపించింది. ప్రాచీ తల్లి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మొదట సూసైడ్ కేసుగా నమోదు చేసుకున్నారు. మొదట అందరూ దీనిని ఆత్మహత్య మరణం అనే నమ్మారు. అయితే పోస్ట్‌మార్టం నివేదికలో ప్రాచీ తలకు తగిలిన బలమైన గాయం కారణంగా మరణించిందని తేలింది. దీనితో పోలీసులు ఇది హత్య కేసని, ఎవరో తప్పుదోవ పట్టించడానికి ఆత్మహత్యగా చిత్రీకరించారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో మృతురాలి పక్కింటిలో ఉన్న శేఖర్ అజబ్‌రావ్ ధోరే అనే వ్యక్తిపై అనుమానం వచ్చింది. దర్యాప్తులో అతను ప్రాచీని ప్రేమిస్తున్నాడని, కానీ ఆమె అతని ప్రేమను తిరస్కరించిందని తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం అంగీకరించాడు.
తన ప్రేమను తిరస్కరిండాన్ని తట్టుకోలేక ధోరే ఆమెను చంపాలని కుట్ర పన్నినట్లు తెలిపాడు. సంఘటన జరిగిన రోజు ప్రాచీ తల్లిదండ్రులు, సోదరుడు బయటకు వెళ్లగా.. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ధోరే ఇంట్లోకి ప్రవేశించాడు. కోపంతో అతను మొదట ఆమెను గొంతు నులిమి చంపాడు. ఆపై ఆమె తలను గోడకు లేదా నేలకు బలంగా కొట్టాడు. నేరాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి అతను ఒక స్కార్ఫ్ ఉపయోగించి ఆమె శరీరాన్ని ఉరి మాదిరి వేలాడదీసినట్లు పోలీసులు హత్య జరిగిన తీరును మీడియాకు వెల్లడించారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు అధికారికంగా హత్య కేసు నమోదు చేసి, నిందితుడు ధోరేను అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.