దసరా అంబరాలకు మారుపేరు మైసూర్‌ ప్యాలెస్. మహారాజు వడియార్ జంబూ సవారీ కోసం కలర్‌ఫుల్‌గా ముస్తాబు

|

Oct 15, 2021 | 6:37 PM

దసరా అంబరాలకు మారుపేరు మైసూర్‌ .. విజయదశమి వేడుకలు అక్కడ కలర్‌ఫుల్‌గా జరుగుతున్నాయి. నిన్న ఆయుధ పూజను భక్తిశ్రద్దలతో నిర్వహించారు మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్.

దసరా అంబరాలకు మారుపేరు మైసూర్‌ ప్యాలెస్. మహారాజు వడియార్ జంబూ సవారీ కోసం కలర్‌ఫుల్‌గా ముస్తాబు
Mysore Palace Dasara
Follow us on

Mysore Dasara 2021: దసరా అంబరాలకు మారుపేరు మైసూర్‌ .. విజయదశమి వేడుకలు అక్కడ కలర్‌ఫుల్‌గా జరుగుతున్నాయి. నిన్న ఆయుధ పూజను భక్తిశ్రద్దలతో నిర్వహించారు మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్. ఇవాళ్టి జంబూ సవారీ కోసం కలర్‌ఫుల్‌గా ముస్తాబయ్యింది మైసూర్‌ ప్యాలెస్‌. కాగా, భారత్‌లో దసరా పండుగ అంటే ప్రతి ఒక్కరికి మైసూర్‌ గుర్తుకొస్తుంది. ఈసారి కూడా మైసూర్‌లో దసరా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. కరోనా ఆంక్షలు ఉన్నప్పటికి వరుసగా రెండో ఏడాది కూడా మైసూర్ ప్యాలెస్ లో దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ 4వ తేదీన లాంచనంగా మైసూర్‌ ప్యాలెస్‌లో విజయదశమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం వరకు దసరా ఉత్సవాలు కలర్‌ఫుల్‌గా జరుగుతాయి. మైసూర్‌ ప్యాలెస్‌లో సాంప్రదాయ రీతిలో ఆయుధ పూజ చేశారు మైసూర్‌ మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్

దసరా సందర్భంగా మైసూర్‌ ప్యాలెస్‌లో నిర్వహించే ప్రతి ఉత్సవానికి ఎంతో చారిత్రక ప్రశస్తి ఉంది. దసరా సందర్భంగా తన పూర్వీకులు ఉపయోగించిన ఆయుధాలకు భక్తిశ్రద్దలతో పూజ చేశారు మైసూర్‌ మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ . ఎన్నో యుద్దాల్లో ఈ ఆయుధాలతో జయించిన చరిత్ర. అందుకే ఎంతో జాగ్రత్తగా ఈ ఆయుధాలను వందల ఏళ్లుగా భద్రపర్చారు. మహా నవవి గజాశ్వది పూజను నిర్వహించారు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ . అశ్వాలను , గజరాజులను ఆయుధపూజలో భాగంగా అందంగా అలంకరించారు.

మైసూర్‌ చాముండేశ్వరి అమ్మను కొలుస్తూ , భక్తికి సంస్కృతిని జోడిస్తూ శరన్నవరాత్రులను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఉత్సవాల్లో కొన్ని ఆంక్షలు విధించారు. ఈసారి కూడా మైసూర్‌ దసరా ఉత్సవాలకు 500 మంది భక్తులను మాత్రమే అనుమతించారు. దసరా కోసం మైసూర్‌ రాజభవనాన్ని అందంగా అలంకరించారు. లైట్లు కాంతుల్లో జిగేలమని మెరుస్తోంది మైసూర్‌ ప్యాలెస్‌. మైసూర్‌ ప్యాలెస్‌లో ఈనెల 7వ తేదీన ప్రైవేట్‌ దర్భారు నిర్వహించారు మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్. అయితే జనానికి , మీడియాకు ఈసారి అనుమతించలేదు. కేవలం కుటంబసభ్యులు , ప్యాలెస్‌ సిబ్బంది మధ్యే దర్భార్‌ను నిర్వహించారు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్

దసరా ఉత్సవాలను కర్ణాటక రాష్ట్రం ‘నాద హబ్బ’ .. రాష్ట్ర పండుగ జరుపుకుంటారు. ఇక ఉత్సవాల్లో భాగంగా మైసూర్సూ రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్.. సాంప్రదాయ దుస్తులను ధరించి ఖాసగి దర్బార్ ను నిర్వహించారు. బంగారు సింహాసనాన్ని అధిరోహించి.. వేద స్తోత్రాలు పఠించారు. మైసూర్ లో దసర ఉత్సవాలు 2020 నాటికి ఈ ఉత్సవాలు మొదలుపెట్టి 410 ఏళ్ళు పూర్తి చేసుకుని ఈ ఏడాది 411 వ సంవత్సరంలోకి అడుగు పెట్టాయి.

మైసూరు దసరా ఉత్సవాలకు వందల ఏళ్ళ చరిత్ర ఉంది. పదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు, పూజలు ఊరేగింపులు దేశ విదేశీయులను సైతం ఆకట్టుకుంటాయి. ఈ ఉత్సవాలు చూసేందుకు ప్రతీ ఏటా లక్షలాది మంది పర్యాటకులు మైసూర్ వస్తున్నారు. ఈసారి మాత్రం ఆంక్షల కారణంగా పరిమిత స్థాయి లోనే భక్తులు హాజరవుతున్నారు. ఇక ఉత్సవాల్లో భాగంగా మైసూర్ ప్యాలెట్ దీప కాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇక్కడ దసరా ఉత్సవాలను 15వ శతాబ్దంలో విజయనగర రాజులు ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలు లు లభ్యమయ్యాయి. పర్షియాకు చెందిన రాయబారి అబ్దుర్ రజాక్ మైసూర్ లోని దసరా ఉత్సవాల గురించి రాసుకున్నారు. విజయనగర సామ్రాజ్య పతనం అనంతరం మైసూరు రాజులైన వడయార్లు శ్రీరంగపట్నలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. దసరా ఉత్సవాల సమయంలో మైసూరు ప్యాలెస్, చాముండీ కొండ దీప కాంతుల్లో వెలిగిపోతుంది. శ్రీరంగపట్నంలో కూడా దసరా ఉత్సవాలను సాంప్రదాయరీతిలో నిర్వహించారు.

1805లో కృష్ణరాజ వడయార్ III దసరా ఉత్సవాలల్లో మైసూరు ప్యాలస్ లో ప్రత్యేక రాజదర్బారు నిర్వహించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అది ఆచారంగా మారిపోయింది.. నేటికీ ప్రయివేట్ దర్భార్ ను వారసులు కొనసాగిస్తూనే ఉన్నారు. నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన మహర్నవమి నాడు రాచఖడ్గాన్ని , ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి పూజలను నిర్వహించారు. . ఈ వేడుకల కన్నుల పండువగా జరుగుతుంది. ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలలో కీలకమైన జంబూ సవారీ కోసం మైసూరు ప్యాలెస్‌లో ఇప్పటికే లో రిహార్సల్స్‌ నిర్వహించారు. శుక్రవారం .. విజయదశమి రోజున జంబూ సవారీ జరగనుంది. అంబారీని మోసే గజరాజు అభిమన్యుకు సోమవారం కొయ్య అంబారీని అమర్చి ఊరేగించారు.

ప్యాలెస్‌ ప్రాంగణంలో అభిమన్యుసహా ఇతర గజరాజులు వెంట నడిచాయి. 750 కిలోల ఇసుక బస్తాలతో కొయ్య అంబారీని సునాయాసంగా అభిమన్యు మోసింది. సీఏఆర్‌ విభాగం డీసీపీ శివరాం నేతృత్వంలో పుష్పార్చన రిహార్సల్స్‌ నిర్వహించారు. అభిమన్యుతోపాటు కావేరి, చైత్ర, అశ్వత్థామ, లక్ష్మి వెంట నడిచాయి. దసరా కోసం అడవి నుంచి వచ్చిన ధనంజయ, గోపాలస్వామి అనే ఏనుగులు ప్యాలెస్‌ పూజల్లో పాల్గొన్నాయి. పోలీసు బ్యాండ్‌ సాగింది. దసరా వేడుకల్లో ముఖ్యమైన ఫిరంగుల ప్రదర్శనకు సంబంధించి రిహార్సల్స్‌ విజయవంతంగా పూర్తయ్యింది.

Read also: Chhattisgarh: దసరా ఉత్సవాల్లో భక్తులపైకి దూసుకెళ్లిన కారు. నలుగురు భక్తులు మృతి, 20 మందికి తీవ్రగాయాలు