ముంబై: సోషల్ మీడియా రీల్స్ ఓ కాపురంలో కలతలు రేపాయి. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిందని భార్యకు విడాకులిచ్చేశాడో భర్త. అదేంటి అనుకుంటున్నారా..? ఐతే మీరి విషయం తెలుసుకోవాల్సిందే..
ముంబైకి చెందిన రుఖ్సర్ సిద్ధిఖీ (23), ముస్తాకిమ్‌లకు గతేడాది మార్చిలో వివాహం జరిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపగుతున్న రుఖ్సర్ ఫిబ్రవరిలో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఇంతలో మార్చి 22న తమ పెళ్లి రోజు కావడంతో తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా రుఖ్సర్.. తమ పెళ్లి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. వాటిని చూసిన భర్త ముస్తాకిమ్ వెంటనే భార్యకు ఫోన్ చేసి తమ పెళ్లి ఫొటోలను తొలగించాలని కోరాడు. రుఖ్సర్ నిరాకరించడంతో ఆమెను చంపుతానని బెదిరించాడు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 26న రుఖ్సర్ అత్తింటికి తిరిగి వచ్చింది. ఐతే ఆమెను ఆత్తింటి వాళ్లు ఇంటి లోపలికి అనుమతించలేదు. ఆమెను ఇంటి బయటే నిలబెట్టి భర్త ముస్తాకిమ్ మౌఖికంగా ట్రిపుల్ తలాక్ చెప్పాడు.
దీంతో భర్తపై రుఖ్సార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ వివాహం జరిగినప్పటి నుంచి అత్తమమాలతో తనకు సత్సంబంధాలు లేవని, తనను నిత్యం హింసించేవారని, అందువల్లనే తను అనారోగ్యం బారీన పడినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. పైగా భర్త నిత్యం వేరే మహిళతో ఇంటికి వచ్చేవాడని, దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని రుఖ్సర్ ఫిర్యాదులో తెల్పింది. దీంతో గృహహింస చట్టం, హత్యా బెదిరింపు, ట్రిపుల్ తలాక్ ఇచ్చినందుకు పలు సెక్షన్ల కింద ముస్తాకిమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.