న్యాయం కోసం అండర్ వరల్డ్ మాజీ డాన్ కూతురి పోరాటం.. ప్రధాని మోదీ, అమిత్ షాలకు విజ్ఞప్తి!

ముంబై అండర్ వరల్డ్‌ను ఒకప్పుడు గడగడలాడించిన డాన్ 'హాజీ మస్తాన్'! ఆయన కన్నుసైగ చేస్తే ముంబై నగరం స్తంభించిపోయేది. అయితే ఇప్పుడు ఆయన వారసురాలినంటూ ఓ మహిళ రోడెక్కి న్యాయ పోరాటం చేస్తోంది. తన తండ్రి గతం.. తన భవిష్యత్తుకు శాపంగా మారకూడదు అంటూ మోదీ, అమిత్ షాకు విజ్ఞప్తి చేసింది. ఇంతకీ ఆమె ఆవేదన ఏంటి..? డాన్‌ డాటర్‌కు ఎందుకీ కష్టాలు..?

న్యాయం కోసం అండర్ వరల్డ్ మాజీ డాన్ కూతురి పోరాటం.. ప్రధాని మోదీ, అమిత్ షాలకు విజ్ఞప్తి!
Haji Mastan's Daughter Haseen Mirza

Updated on: Dec 22, 2025 | 7:35 AM

ముంబై అండర్ వరల్డ్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన హాజీ మస్తాన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆయన చేసిన నేరాల వల్ల కాదు… ఆయన కుమార్తె హసీన్ మస్తాన్ మీర్జా కన్నీటి ఆవేదన వల్ల..! మాజీ డాన్ హాజీ మస్తాన్ కుమార్తెగా తనను తాను పరిచయం చేసుకున్న హసీన్ మస్తాన్ మీర్జా, తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 1994లో తన తండ్రి హాజీ మస్తాన్ మరణం తర్వాత నరకప్రాయమైన జీవితాన్ని గడిపానని ఆవేదన వ్యక్తం చేసింది. సొంత కుటుంబమే తనను కష్టాల్లోకి నెట్టిందని ఆరోపించింది హసీన్ మస్తాన్ మీర్జా.

1996లో తాను మైనర్‌గా ఉన్నప్పుడే, ఆస్తి కోసం తన మేనమామ కొడుకుతో బలవంతంగా పెళ్లి చేశారని ఆరోపించింది హసీన్. పెళ్లి చేసుకున్న వ్యక్తి తనను వేధించాడని… చంపడానికి కూడా ప్రయత్నించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన మాజీ భర్తకు అప్పటికే ఎనిమిది పెళ్లిళ్లు అయ్యాయని చెప్పుకొచ్చింది. ఈ వేధింపులు తట్టుకోలేక మూడుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు తెలిపింది. సహాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే తన తండ్రి గతానికి సంబంధించిన ప్రశ్నలే వేసేవారని ఆమె ఆరోపించింది.

ఇప్పుడు తన తండ్రి ఆస్తిలో తనకు వాటా ఇప్పించాలని… తనను వేధింపులకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తోంది హసీన్ మస్తాన్ మీర్జా. ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న తనుకు న్యాయం చేయాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసింది. ఇది తన వ్యక్తిగత పోరాటమని, తన తండ్రి గతంతో దీనికి సంబంధం లేదని హసీన్ స్పష్టం చేసింది. తన లాంటి బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా మరిన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆమె కోరింది. మొత్తంగా హసీన్ మస్తాన్ మీర్జా ఆరోపణలు దుమారం రేపడంతో పోలీసులు ఈ కేసుపై దృష్టి సారించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..