నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక.. కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సీతక్క

నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాను కేంద్రం ఎంపిక చేసింది. ములుగు జిల్లాను ఎంపిక చేయడం పట్ల తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.

నిర్భయ నిధి కింద ములుగు జిల్లా ఎంపిక.. కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సీతక్క
Minister Seethakka Meets Union Minister Annapurna Devi

Edited By:

Updated on: Mar 14, 2026 | 12:16 PM

నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాను కేంద్రం ఎంపిక చేసింది. ములుగు జిల్లాను ఎంపిక చేయడం పట్ల తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు పథకం ద్వారా ములుగు జిల్లాలో మహిళలు, బాలికల భద్రత, గౌరవం, రాకపోకల సౌకర్యాన్ని మెరుగు పరిచేందుకు జెండర్-రెస్పాన్సివ్ మౌలిక సదుపాయాలు, మెరుగైన నిఘా వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.
ములుగులో ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీలో.. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ.. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పూర్తి సహకారాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రికి సీతక్క తెలియజేశారు. మహిళా సాధికారత, భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవను అభినందిస్తూ.. తెలంగాణలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల రక్షణను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలి: సీతక్క

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పాలనా’ (Palna Scheme – మిషన్ శక్తి) పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం క్రెచ్ వర్కర్లకు నెలకు రూ. 5,500, హెల్పర్లకు రూ. 3,000 మాత్రమే గౌరవ వేతనంగా ఇస్తున్నారని.. ఇది వారు చేసే పనికి, బాధ్యతకు ఏమాత్రం సరిపోదని మంత్రి సీతక్క కేంద్రమంత్రికి వివరించారు. ఒక క్రెచ్‌లో దాదాపు 25 మంది పిల్లల సంరక్షణను చూడటం ఎంతో బాధ్యతతో కూడుకున్న పని అని.. ప్రస్తుత జీవన ప్రమాణాల దృష్ట్యా ఈ వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని మంత్రి సీతక్క వివరించారు.

తక్కువ వేతనాల వల్ల నిపుణులైన సిబ్బందిని ఈ పథకంలో కొనసాగించడం కష్టమవుతోందని, ఇది పరోక్షంగా శిశు సంరక్షణపై ప్రభావం చూపుతుందన్నారు. పనిచేసే తల్లులకు అండగా నిలిచే ఈ పథకం విజయవంతం కావాలంటే.. సిబ్బందికి ఇచ్చే వేతనాలను ప్రస్తుత వేతన ప్రమాణాలకు అనుగుణంగా పెంచాలని మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారత, శిశు సంక్షేమం కోసం పనిచేస్తున్న సిబ్బంది ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us