చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఏపీలోని మల్బరీ రైతుల పంట పండిస్తోంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం రైతుల మల్బరీకి ఉన్న ఫళంగా గిరాకీని తెచ్చిపెట్టింది. కరోనా వైరస్ దెబ్బకు చైనా వ్యాపార మార్కెట్ కుదేలు కాగా దాని ఎఫెక్ట్ సిల్క్‌పై ప్రభావం చూపుతోంది. చైనా ఎగుమతులపై కొవిడ్ ప్రభావం ఆ దేశానికి శాపం కాగా కుప్పం మల్బరీ రైతాంగానికి వరంగా మారింది.
చైనాలో ప్రబలిన కొవిడ్ వైరస్ ఆ దేశ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటుండగా, మరోవైపు ఆ దేశ ఎగుమతులపై చూపుతున్న ప్రభావం ఇతర దేశ ఉత్పత్తులకు గిరాకీని పెంచుతోంది. కొవిడ్ వైరస్ ఆ దేశ ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోవడంతో కుదేలైన చైనా మార్కెట్ కుప్పంలో మల్బరీ సాగు చేస్తున్న రైతులకు వరంగా మారింది. కొవిడ్ వైరస్ కారణంగా చైనా నుంచి కూరగాయలు, పూలు, పండ్లు దిగుమతి ఆగిపోవడం. వ్యాపారులు ఆ దేశ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపని పరిస్థితుల్లో కుప్పం ప్రాంతంలోని మల్బరీ సాగు చేస్తున్న రైతులకు ఉన్న పళంగా మంచి ధర లభిస్తోంది.
సిల్క్ వస్త్రాల తయారీ మల్బరీని సాగు చేస్తున్న కుప్పం, పలమనేరు, మదనపల్లి ప్రాంత రైతాంగానికి చైనా సిల్క్ మార్కెట్ పోటీ ఉండడంతో మల్బరీ రైతాంగానికి సరైన ధర లభించే అవకాశం లేకపోయింది. తమిళనాడులోని కాంచీపురంలో ఉండే పట్టునేత కార్మికులు ఎక్కువగా వాడే సిల్క్…చైనా నుంచి దిగుమతి లేకపోవడంతో ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని రీలింగ్ సెంటర్ల నుంచి సిల్క్‌ను కొనుగోలు చేస్తుండటంతో మల్బరీ రైతుల పంట పండుతోంది. పట్టుగూళ్లకు భలే గిరాకీ తీసుకొచ్చిన కరోనా ఇప్పుడు మల్బరీ సాగు చేసిన రైతుల దిశ తిరిగేందుకు కారణం అయ్యింది. గతంలో కిలో పట్టుగూళ్లు రూ.300 లోపు ఉండగా, ఇప్పుడు రెట్టింపు ధర పలుకుతోంది. కొవిడ్- 19 దెబ్బతో కిలో పట్టుగూళ్ల ధర రూ. 600 ల నుంచి రూ. 700 వరకు పలుకుతుంది. కొవిడ్ ఎఫెక్ట్ ఇలాగే ఉంటే కిలో ధర వెయ్యి రూపాయలకు చేరుతుందని రైతులు అభిప్రాయ పడుతున్నారు. చైనా ఎగుమతులను నిలిపివేస్తే తమ పంట పండినట్లేనని, ధరలు ఇలాగే ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. కొవిడ్ దెబ్బతో చైనా నుంచి పట్టు ఎగుమతి లేపోవడంతో జిల్లాలో మల్బరీ సాగు చేసిన రైతులకు మంచి ధర లభిస్తోందంటున్న ఉద్యానవనశఖ అధికారులు..ఈ సీజన్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు.