మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో భయాందోళనలు నెలకొన్నాయి. మగర్ధ రోడ్డులోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 11మంది మృతి చెందగా, 90 మందికి పైగా గాయపడి ఆసుపత్రిలో చేరినట్టుగా సిఎంహెచ్‌ఓ ధృవీకరించింది. ప్రమాదం సమయంలో ఆ ప్రాంతమంతా భయంకరమైన పేలుళ్లు జరగడం ప్రారంభించాయి. పేలుళ్ల విధ్వంసంతో చుట్టుపక్కల భవనాలు కూడా కంపించాయి. మంటలు చుట్టుపక్కల ఉన్న ఇళ్లను కూడా చుట్టుముట్టాయి. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. జరిగిన దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని స్థానిక యంత్రాంగం అందిస్తుందని హామీ ఇచ్చారు. మరణించిన బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పీఎం రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 అందించనున్నట్లు వెల్లడించారు.
Distressed by the loss of lives due to the mishap at a cracker factory in Harda, Madhya Pradesh. Condolences to all those who have lost their loved ones. May those injured recover at the earliest. The local administration is assisting all those affected.
Rs. 2 lakh from PMNRF…
— PMO India (@PMOIndia) February 6, 2024
హర్దా పేలుడుకు సంబంధించి ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే, మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్‌తో పాటు, సీనియర్ అధికారులను హర్దాకు బయలుదేరాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందన్నారు. వారి పిల్లల చదువుల ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
ప్రమాదం స్థలంలో వాహనాలు సమీపంలోని రోడ్డుపై నుంచి ఎగిరి పడిపోయాయి. రోడ్డుపైనే కొందరు చనిపోయారు. వారి మృతదేహాలు రోడ్డు పక్కన పడి ఉన్నాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ ఆసుపత్రిలో చేర్చారు. NDRF, SDRF సహాయం తీసుకుంటోంది. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన తర్వాత సమీపంలోని 60కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఫ్యాక్టరీ చుట్టూ రోడ్డుపై కొన్ని మృతదేహాలు పడి ఉన్నాయి. గాయపడిన వారిని హర్దా జిల్లా ఆసుపత్రికి తరలించారు. దాదాపు 100కు పైగా ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. పేలుడు తాకిడికి సమీపంలోని రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కూడా కొంతదూరం వరకు ఎగిరిపడ్డాయి.. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఫ్యాక్టరీ నుంచి ఎగసిపడుతున్న మంటలు, పొగ దూరం నుంచి కనిపించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..