Supreme Court: ఆ విషయంలో తల్లికి పూర్తి హక్కు ఉంది.. సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు..

|

Jul 29, 2022 | 11:42 AM

Supreme Court: పిల్లల ఇంటిపేరును నిర్ణయించే హక్కు కన్న తల్లికి ఉంటందని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Supreme Court: ఆ విషయంలో తల్లికి పూర్తి హక్కు ఉంది.. సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు..
Supreme Court
Follow us on

Supreme Court: పిల్లల ఇంటిపేరును నిర్ణయించే హక్కు కన్న తల్లికి ఉంటందని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మహిళ మొదటి భర్త చనిపోయిన తరువాత కూడా బిడ్డను తన చెంతకు చేర్చుకోకుండా నిరోధించలేమని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు దినేష్ మహేశ్వరి, కృష్ణ మురారీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ‘తల్లి మాత్రమే బిడ్డకు సహజ సంరక్షకురాలిగా ఉండటం వల్ల బిడ్డ ఇంటిపేరును నిర్ణయించే హక్కు ఉంటుంది. బిడ్డను దత్తత తీసుకునే హక్కు కూడా ఆమెకు ఉంటుంది’ అని ధర్మాసనం పేర్కొంది. గీతా హరిహరన్ అండ్ ఆర్స్ వర్సెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతరుల కేసులో.. హిందూ మైనారిటీ, దత్తత చట్టం, 1956. సెక్షన్ 6 ప్రకారం మైనర్ పిల్లల సహజ సంరక్షకురాలిగా తల్లి హక్కును బలపరుస్తూ, తండ్రితో సమానమైన స్థానానికి సైతం ఉన్నత న్యాయస్థానం కల్పింది.

బెంచ్ తరపున తీర్పును వెలవరించిన జస్టిస్ మురారి.. ‘మహిళ మొదటి భర్త మరణించిన తరువాత, బిడ్డకు ఏకైక సహజ సంరక్షకుడిగా తల్లి ఉంటుంది. మరో పెళ్లి తరువాత ఆ బిడ్డను తల్లి తన కొత్త కుటుంబంతో చేర్చుకోకుండా చట్టబద్ధంగా నిరోధించలేము. కొత్త కుటుంబంలో పిల్లల ఇంటి పేరును నిర్ణయించే హక్కు ఆ తల్లికి ఉంటుంది.’ అని స్పష్టం చేశారు.

‘ఇంటిపేరు అనేది ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కుటుంబంలోని ఇతర సభ్యులతో పంచుకునే పేరును సూచిస్తుంది. ఇది వంశాన్ని సూచించడమే కాకుండా కేవలం చరిత్ర, సంస్కృతి, వంశం నేపథ్యంలో అర్థం చేసుకోకూడదు. పిల్లల భవిష్యత్ కోసం అనే భావనతో పాటు సామాజిక వాస్తవికతకు సంబంధించి ఉంటాయి. ఇంటిపేరు సజాతీయత కుటుంబాన్ని సృష్టించడానికి, నిలబెట్టడానికి, ప్రదర్శించడానికి ఒక మోడ్‌గా ఉద్భవించింది’ అని బెంచ్ పేర్కొంది.

పిల్లల ఇంటిపేరు, తండ్రి ఇంటిపేరు పునరుద్ధరణకు సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయాలని ఓ తల్లికి 2014లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. మహిళ మొదటి భర్త 2006లో తన బిడ్డకు కేవలం రెండున్నరేళ్ల వయసులో మరణించాడు. ఆమె 2007లో మళ్లీ పెళ్లి చేసుకుంది. అయితే, పిల్లవాడి తాతలు, తండ్రి వైపు నుండి బంధువులు.. పిల్లవాడు తన వారసత్వమైన తండ్రి ఇంటిపేరును ఉపయోగించడానికి అనుమతించాలని కోర్టును కోరారు. అసలు తండ్రి పేరు చూపాలని, లేనిపక్షంలో ఆ మహిళ రెండో భర్త పేరును సవతి తండ్రిగా పేర్కొనాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే, హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జూలై 2019లో పిల్లాడి సవతి తండ్రి.. రిజిస్టర్డ్ ద్వారా దత్తత తీసుకున్నారు. అయితే, డాక్యుమెంట్లలో మహిళ భర్త పేరును సవతి-తండ్రిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ నిర్ణయం.. క్రూరమైనదని, అది పిల్లల మానసిక ఆరోగ్యం, ఆత్మగౌరవంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై అత్యున్నత న్యాయస్థానం క్లారిటీ ఇచ్చింది. ‘‘పిల్లవాడికి పేరు ఎంత ముఖ్యమొ.. సర్ నేమ్ కూడా అంతే ముఖ్యం. ఆ సర్‌నేమ్‌లో వ్యత్యాసం ఉండటం అనేది.. కుటుంబం నుంచి అతన్ని వేరు చేస్తున్నట్లుగానే ఉంటుంది. దత్తత వ్యవహారాన్ని నిరంతరం గుర్తు చేస్తుంది. అతనికి, అతని తల్లిదండ్రుల మధ్య సున్నితమైన, సహజమైన సంబంధానికి ఆటంకం కలిగిస్తుంది.’ అని జస్టిస్ మురారి అన్నారు.

‘పునర్వివాహం చేసుకున్న తర్వాత, బిడ్డకు తన భర్త ఇంటిపేరును ఇవ్వడం, బిడ్డను తన భర్తకు దత్తత ఇవ్వడాన్ని అసాధారణంగా ఏమీ చూడటం లేదు.’ అని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..