AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవరూ లేని వీధిలో మహిళతో అసభ్య ప్రవర్తన.. తమ మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఖాకీలు

ఉత్తర ప్రదేశ్‌లోని మురదాబాద్‌లో మహిళపై వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుర్ఖా ధరించిన మహిళను వెంబడించి అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలతో 45 ఏళ్ల నౌషాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని పట్టుకునే క్రమంలో నిందితుడు కాల్పులకు దిగడంతో .. ..

ఎవరూ లేని వీధిలో మహిళతో అసభ్య ప్రవర్తన.. తమ మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఖాకీలు
Moradabad Incident
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: May 03, 2026 | 8:54 PM

Share

ఉత్తర ప్రదేశ్‌లోని మురదాబాద్‌లో మహిళపై వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుర్ఖా ధరించిన మహిళపై జన సంచారం లేని వీధిలో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 45 ఏళ్ల నౌషాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, అతను కాల్పులకు దిగినట్లు అధికారులు తెలిపారు. దీనికి ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరపడంతో నౌషాద్ ఎడమ కాలికి బుల్లెట్ తగిలి కిందపడిపోయాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ నగరంలోని జామా మసీదు సమీపంలో చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

పోలీసుల సమాచారం ప్రకారం నిందితుడు నౌషాద్ వృత్తిరీత్యా లేడీస్ టైలర్‌గా పనిచేస్తూ అవివాహితుడిగా జీవిస్తున్నాడు. ఈ నెల 29వ తేదీన ఒక మహిళ తన పనికి వెళ్తున్న సమయంలో అతను వెంబడించి అకస్మాత్తుగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ప్రతిఘటించి గట్టిగా అరిచిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో కేసు మలుపు తిరిగింది. వీడియోలో నిందితుడు మహిళను వెంబడించి వేధించడం స్పష్టంగా కనిపించడంతో పోలీసులు అతన్ని గుర్తించారు. వెంటనే ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో నౌషాద్ ఇంతకుముందు కూడా పలువురు మహిళలతో అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం బయటపడింది. అయితే బాధితులు ఎవరూ అధికారికంగా ఫిర్యాదు చేయకపోవడం వల్ల అతనిపై ముందుగా కేసులు నమోదు కాలేదని పోలీసులు పేర్కొన్నారు. ఘటన అనంతరం నిందితుడు దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో అతను రామ్ గంగా నది సమీపంలోని జామా మసీదు వద్ద ఉన్నట్లు గూఢచారి సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అతనికి లొంగిపోవాలని హెచ్చరించారు. కానీ అతను పోలీసులపై కాల్పులకు దిగడంతో ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ సమయంలో నిందితుడి వద్ద నుంచి ఒక దేశీయ తుపాకీతో పాటు మూడు కార్తూష్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే సమయంలో బాధిత మహిళను గుర్తించి ఆమె ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన నగరంలో మహిళల భద్రతపై మరోసారి చర్చకు దారి తీసింది. పోలీసులు ఇటువంటి సంఘటనలను తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.

Follow Us