RSS Meet in Delhi: హస్తినలో నేడు ఆర్ఎస్ఎస్ కీలక భేటీ.. యూపీ ఎన్నికలు సహా ఆ అంశాలపై ప్రత్యేక ఫోకస్

|

Jun 05, 2021 | 7:32 AM

RSS Meet: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) కీలక భేటీ దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ జరగనుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ అగ్రస్థాయి ప్రతినిధులు పాల్గొననున్నారు.

RSS Meet in Delhi: హస్తినలో నేడు ఆర్ఎస్ఎస్ కీలక భేటీ.. యూపీ ఎన్నికలు సహా ఆ అంశాలపై ప్రత్యేక ఫోకస్
Rss Chief Mohan Bhagwat
Follow us on

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) కీలక భేటీ దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ జరగనుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ అగ్రస్థాయి ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రధానంగా మోదీ సర్కారుపై ప్రజల్లో విశ్వసనీయతను కాపాడేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. అలాగే వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు చర్చించవచ్చని సమాచారం. ఎన్నికల నేపథ్యంలో యూపీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆర్ఎస్ఎస్ యూపీ నాయకత్వానికి కీలక సూచనలు చేసే అవకాశముంది. అలాగే పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. పశ్చిమ బెంగాల్‌తో సహా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా సమీక్షించనున్నారు.

అలాగే దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులు, ఆర్ఎస్ఎస్ చేపట్టాల్సిన సహాయక చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రెండ్రోజుల క్రితమే మోహన్ భగవత్ హస్తినకు చేరుకున్నారు. వచ్చే ఏడాది మొదట్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరు మాసాలకు ముందుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ హస్తినలో పర్యటిస్తుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర సర్కారుపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్న కథనాలు వినిపిస్తున్నాయి. కోవిడ్ టీకాల కొరత విషయంలో విపక్షాలు ఉమ్మడిగా కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి. సెకండ్ వేవ్ ముంచుకొస్తున్నా కేంద్రానికి సరైన ముందుచూపు లేక కరోనా వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేసిందని విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్‌ను కట్టడి చేయకలేకపోవడానికి వ్యాక్సినేషన్‌లో జాప్యమే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. దీని ప్రభావం వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశముందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లకుండా బాసటగా నిలవనుంది ఆర్ఎస్ఎస్.

ఇవి కూడా చదవండి..

నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల రాజేందర్..