Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వరుసగా రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈరోజు కచ్ జిల్లాలోని భుజ్‌లో స్మృతి వన్ మెమోరియల్‌ను ఆయన ప్రారంభించారు. దీంతో పాటు రూ.4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. రెండో రోజు పర్యటనలో తొలుత స్మృతి వన్‌కు వెళ్లే మార్గంలో, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ భుజ్‌లో మూడు కిలోమీటర్ల మేర భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈఏడాది చివరిలో గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తిరిగి ఇక్కడ అధికారం చేపట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గుజరాత్ తో పాటు.. ఈఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతి నెల సందర్శించేలా ప్లాన్ చేశారు. ప్రధానమంత్రి పర్యటనలో కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దీనిలో భాగంగా నిన్న పలు కార్యక్రమాల్లో పాల్గొని క్షణం తీరిక లేకుండా గడిపిన ప్రధానమంత్రి, రెండో రోజూ కూడా అంతే బిజీగా గడుపుతన్నారు.
భుజ్ లో దాదాపు 470 ఎకరాల విస్తీర్ణంలో స్మృతి వన్ స్మారకాన్ని నిర్మించారు. 2001లో గుజరాత్ లో సంభవించిన భూకంపంలో 20 వేల మందికి పైగా మరణించారు. భూకంపం తర్వాత ఈ విషాదం నుండి కోలుకోవడానికి 2001 నుంచి 2014 వరకు సీఏంగా పనిచేసిన ప్రధాని మోదీ ఎన్నో చర్యలు తీసుకున్నారు. భూకంపం తర్వాత ప్రజల చూపిన ఆత్మస్థైర్యాన్ని, స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ స్మారక చిహ్నన్ని నిర్మించారు. భూకంపం కారణంగా మరణించిన వారి పేర్లు ఈ స్మారక చిహ్నంలో చెక్కబడ్డాయి. భుజ్‌లో ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, సర్హాద్ డెయిరీలో కొత్త ఆటోమేటెడ్ మిల్క్ ప్రాసెసింగ్ , ప్యాకింగ్ ప్లాంట్, గాంధీధామ్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్, అంజర్‌లో వీర్ బాల్ స్మారక్ తో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. రెండో రోజు పర్యటనలో ప్రధానమంత్రి నిర్వహించిన రోడ్ షోకు బీజేపీ కార్యకర్తలు, మోదీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు. రోడ్ షో సాగినంత సేపు మహిళలు, యువత రోడ్డుకిరువైపులా భారీగా వచ్చి చేరుకున్నారు. బీజేపీ జెండాలతో పాటు, జాతీయ జెండాలు చేతబట్టి మహిళలు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ తన వాహనంలో నుంచి బయటకు చూస్తూ.. అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.