Modi govt 8 years: వ్యవసాయ చట్టాల నుంచి దేశ ద్రోహ చట్టం వరకు.. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో అనేక చట్టాల రద్దు..!

| Edited By: Ravi Kiran

May 26, 2022 | 6:57 AM

Modi govt 8 years: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 26 మే 2022 నాటికి ఎనిమిదేళ్లు పూర్తవుతోంది. అలాగే రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్ల అవుతోంది.

Modi govt 8 years: వ్యవసాయ చట్టాల నుంచి దేశ ద్రోహ చట్టం వరకు.. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో అనేక చట్టాల రద్దు..!
Modi 8 Years
Follow us on

Modi govt 8 years: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 26 మే 2022 నాటికి ఎనిమిదేళ్లు పూర్తవుతోంది. అలాగే రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్ల అవుతోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన ఇన్నేళ్లలో వరుసగా ఎనిమిదేళ్లు పాలించిన కాంగ్రెసేతర ప్రభుత్వంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌‌కే చెందుతుంది. ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే, నరేంద్ర మోదీ ప్రధానిగా ఎనిమిదేళ్ల పాలనా కాలంలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించే నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, ఎనిమిదేళ్ల ప్రధాని మోదీ పాలనలో చూసిన అనేక అంశాలలో అనేక చట్టాలను రద్దు చేయడం, మరికొన్ని అంశాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. అవన్నింటి నుంచి తప్పించుకోగలిగారు. రికార్డు స్థాయిలో వాడుకలో లేని చట్టాలను మోదీ సర్కార్ రద్దు చేసింది. మరికొన్ని చట్టాలను బలవంతంగా తీసుకువచ్చింది. కొన్ని చట్టాలను మాత్రం ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అలాంటి వాటిలో ప్రముఖంగా వ్యవసాయ సాగు చట్టాలను చెప్పుకోవచ్చు. తాజాగా వివాదాస్పద దేశద్రోహ చట్టంపై వైఖరి మార్చుకుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఏయే చట్టాలను రద్దు చేశారు? ఏ చట్టాలను మార్చారో ఇప్పుడు తెలుసుకుందాం..

వ్యవసాయ చట్టాలు..
వ్యవసాయాన్ని లాభసాటి చేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. నూతన సాగు చట్టాలను తీసుకువచ్చింది. అయితే, ఈ సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ చట్టాల వద్ద రైతుల జీవితాలు ఆగం అవుతాయంటూ నిరసనకు దిగారు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు ఏడాది పాటు ఆందోళనకు వ్యక్తం చేశారు. రైతు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో.. కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని 2021 నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ప్రధాని మోదీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను వారి ఇళ్లకు తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

భూసేకరణ బిల్లు..
భూసేకరణ బిల్లు కూడా వివాదాస్పదం అయ్యింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత 2015లో ప్రభుత్వం తన వివాదాస్పద భూసేకరణ చట్టాన్ని పునఃసమీక్షించాలన్న డిమాండ్‌ను అంగీకరించాల్సి వచ్చింది. ఇది కూడా ఒక వర్గం రైతుల నిరసనల ఫలితంగా 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది వారాల ముందు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. భూయజమానుల అనుమతి లేకుండా భూమిని సేకరించడం, సామాజిక ప్రభావ అంచనాను చేపట్టడం కోసం మోడీ ప్రభుత్వం కీలకమైన మార్పులను ప్రవేశపెట్టింది. దీనిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకంగా.. మరోవైపు ఈ భూసేకరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందగా, ఎగువసభలో ఓడిపోయింది. దాంతో ఆ బిల్లు మూలన పడిపోయింది.

ఆర్టికల్ 370..
మోడీ ప్రభుత్వం తీసుకున్న అత్యంత చారిత్రాత్మక నిర్ణయాలలో ఒకటి ఆగస్ట్ 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం. ఇది జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయానికి ముందు జమ్మూ కశ్మీర్ దేశంలో ప్రత్యేక రాజ్యాంగం కలిగిన ఏకైక రాష్ట్రం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత J&Kకి దాని స్వంత రాజ్యాంగాన్ని కలిగి ఉండే అధికారాన్ని మంజూరు చేసిన ప్రత్యేక నిబంధన కూడా రద్దు చేయబడింది, J&K దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండేలా చేసింది.

దేశద్రోహ చట్టంపై వైఖరి..
మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులపై దేశద్రోహ చట్టం కింద అభియోగాలు మోపుతుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అయితే, ఈ దేశద్రోహం చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. కేంద్రం ఈ వివాదాస్పద చట్టంపై తన వైఖరిని తెలుపాలని సూచించింది. అయితే, వలసవాద కాలం నాటి ఈ చట్టాన్ని పునఃపరిశీలించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. దాంతో బ్రిటీష్ కాలం నాటి ఆ చట్టాన్ని రద్దు చేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124A కింద ఎలాంటి ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయొద్దని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు కోరింది. దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తూ కాలం చెల్లిన వలసవాద చట్టాలను తొలగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ నెల ప్రారంభంలో దేశద్రోహ చట్టంపై తన వైఖరిని మార్చుకున్న కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది.

మొత్తం 1,500 చట్టాలు రద్దు..
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014-15 నుండి కాలం చెల్లిన 1,500 చట్టాలు రద్దు చేయడం జరిగింది. అలాగే చట్టాల్లోని 25 వేల అంశాలను తొలగించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.