Modi government speeded up disinvestment: మూడు దశాబ్దాల క్రితం మొదలైన ఆర్థిక సంస్కరణ పంథాలో పెట్టుబడుల ఉపసంహరణ కీలకాంశం. తద్వారా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం, ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడం వంటివి గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. దివంగత పీవీ నరసింహారావు ప్రభుత్వం హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా దేశంలో ఆర్థిక సంస్కరణలు షురువయ్యాయి. ఈ మూడు దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్లోంచి ప్రభుత్వ వాటాను ప్రైవేటు సంస్థలకు విక్రయించి, వాటి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడమే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేలా చేశాయి గత ప్రభుత్వాలు. వ్యాపారం చేయడం ప్రభుత్వాల పని కాదంటున్న ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలోంచి కేంద్ర ప్రభుత్వ వాటాను విక్రయానికి పెట్టారు.
వైజాగ్ స్టీల్ ప్లాంటులోని ప్రభుత్వ వాటాను విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓవైపు ఆందోళనలు కొనసాగుతుండగానే మరోవైపు కేంద్రం మరింత స్పష్టంగా స్టీల్ ప్లాంట్‌లో వాటాను విక్రయించడంలో పునరాలోచన ఏమీ లేదని కుండబద్దలు కొట్టింది. దాంతో నిప్పు మీద ఉప్పు పడిన చందంగా మంగళవారం (మార్చి 9న) విశాఖపట్నం అట్టుడికిపోయింది. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలతో కార్మిక, రాజకీయ నాయకులు హోరెత్తించారు. స్టీల్ ప్లాంట్ అధికారులను ఘెరావ్ చేశారు. పెట్టుబడుల ఉపసంహరణపై అధికారుల వైఖరేంటో తేల్చాలని నిలదీశారు. చివరికి పోలీసుల జోక్యంతో అధికారులను వదిలేశారు కార్మికులు. ఇదంతా నాణేనికి ఓ వైపు. మరోవైపు దేశంలో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పెట్టుబడుల ఉపసంహరణ ఒక్క వైజాగ్ విషయానికి వచ్చేసరికి ఆగుతుందా? అసలు ఇప్పటి దాకా పెట్టుబడుల ఉపసంహరణ విధానం ఎలా కొనసాగుతోంది? ఈ అంశాలను చూద్దాం..
స్వాతంత్రం తరువాత దేశంలో ఇప్పటివరకూ ప్రభుత్వ రంగంలో 300 పైగా సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇందులో 10 మహారత్న కంపెనీలు, 14 నవరత్న కంపెనీలు, 74 మినీ రత్న కంపెనీలున్నాయి. దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో 33 ప్రభుత్వ రంగం సంస్థలు ప్రారంభమయ్యాయి. రెండో ప్రధాని హయాంలో అయిదు, ఇందిరా గాంధీ హయాంలో 66, మొరార్జీ దేశాయ్ హయాంలో 9, రాజీవ్ గాంధీ పరిపాలనా కాలంలో 16, విపి సింగ్ హయాంలో 2, పివి నరసింహరావు ప్రభుత్వ హయాంలో 14, దేవెగౌడ, గుజ్రాల్ హయాంలో 3, వాజ్‌పేయి హయాంలో 17 ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. అయితే.. వారిలో పివి నరసింహరావు ప్రభుత్వమే దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టింది. ఆ తర్వాత వాజ్‌పేయి ప్రభుత్వ హాయంలో డిజిన్వెస్టుమెంటు ప్రక్రియ మొదలైంది. వాజ్‌పేయి హయాంలో 7 ప్రభుత్వ రంగ సంస్థల్లోంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. మన్మోహన్ సింగ్ హయాంలో కొత్తగా పబ్లిక్ రంగ సంస్థలు ఏడు ప్రారంభం కాగా.. పెట్టుబడులు ఉపసంహరించినవి 3. తాజాగా నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ వేగమందుకుంది. గత ఏడేళ్ళలో ఒక్కటి కూడా పబ్లిక్ రంగ సంస్థ ప్రారంభం కాకపోగా.. పెట్టుబడులు ఉపసంహరించి, ప్రైవేటుకు అప్పగించిన సంస్థల సంఖ్య 23.
ప్రారంభంలో ప్రభుత్వ రంగ సంస్థలలో కొద్ది మొత్తంలో పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాలు జరిగాయి. తాజాగా అనేక సంస్థలలో 100 శాతం వాటాలు విక్రయిస్తోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. వీటిలో అత్యధిక శాతం గుజరాత్‌కు చెందిన బడా పారిశ్రామికవేత్తల చేతికే చేరుతున్నాయన్న కథనాలు కూడా వున్నాయి. గత 20 ఏళ్ళలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చరిత్రలో కొన్ని కీలకాంశాలు, ఘట్టాలు కనిపిస్తాయి. 1999-2004 మధ్య వాజ్‌పేయి ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో పబ్లిక్ రంగ సంస్థల్లోంచి వాటాల విక్రయం ద్వారా సమీకరించిన మొత్తం రూ.24,620 కోట్లు. ఓఎన్జీసీలో 10 శాతం వాటా విక్రయించి రూ.10,542 కోట్లు, ఐపీసీఎల్‌లోని 26 శాతం వాటాకు రూ.1,491 కోట్లు, వీఎస్‌ఎన్‌ఎల్‌లోని 25 శాతం వాటాకు రూ.1,439 కోట్లు, సుజుకీ మారుతీ ఉద్యోగ్‌లోని 27.5 శాతం వాటాకు రూ.993 కోట్లు హిందుస్థాన్ జింక్ నుంచి 22.1 శాతం వాటాకు రూ.445 కోట్లు, సీఎంసీలోని 51 శాతం వాటాకు రూ.152 కోట్లు కేంద్ర ఖజానాకు చేరాయి.
ఆ తర్వాత మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యుపీఏ ప్రభుత్వ హయాంలో 2004-09 వాటాల విక్రయం ద్వారా సమీకరించిన మొత్తం రూ.8,516 కోట్లు. ఎన్టీపీసీ నుంచి 5.3 శాతం వాటా విక్రయించి రూ.2,684 కోట్లు, పవర్‌గ్రిడ్ నుంచి 4.6 శాతం వాటా విక్రయించి రూ.995 కోట్లు, ఆర్‌ఈసీ నుంచి 9.1 శాతం వాటా విక్రయించి రూ.820 కోట్లు రాబట్టింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ రెండో టెర్మ్ 2009-14 మధ్యకాలంలో వాటాల విక్రయం ద్వారా సమీకరించిన మొత్తం రూ.1,05,529 కోట్లు. కోల్ ఇండియాలో 10 శాతం వాటాను ఐపీఓ ద్వారా విక్రయించి రూ.15,199 కోట్లు రాబట్టారు. 2013-14లో సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను విధానాన్ని పరిచయం చేసింది యూపీఏ-2 ప్రభుత్వం. ఈ విధానంలో తొలి విడతలో రూ.3,000 కోట్ల నిధులను సమీకరించారు. బీహెచ్‌ఈఎల్, ఎన్‌బీసీసీ, కోల్ ఇండియా, ఎన్‌ఎల్‌సీ ఇండియా, ఎన్‌టీపీసీ, ఆయిల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఎస్‌జేవీఎన్, కొచ్చిన్ షిప్‌యార్డ్, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌ఎమ్‌డీసీ వంటి 12 ప్రభుత్వ సంస్థల షేర్లను అమ్మకానికి పెట్టింది యూపీఏ-2 సర్కార్. యాక్సిస్ బ్యాంక్‌లో 9 శాతం వాటా అమ్మి రూ.5,500 కోట్ల నిధులను సమకూర్చుకుంది.
తాజాగా నరేంద్ర మోదీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత 2014-19 మధ్యకాలంలో ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా సమీకరించిన మొత్తం రూ.2,80,490 కోట్లు. దీనిలో ఒక్క హెచ్‌పీసీఎల్ నుంచి 51.1 శాతం వాటా విక్రయం ద్వారానే రూ.36,915 కోట్లు రాబట్టింది మోదీ ప్రభుత్వం. ఆర్‌ఈసీలోంచి 52.6 శాతం వాటా అమ్మకం ద్వారా రూ.14,500 కోట్లు వచ్చాయి.
మోదీ హయాంలో పెట్టుబడులు ఉపసంహరించిన సంస్థలు:
1. హిందుస్ధాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
2. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్
3. హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్
4. నేషనల్ ప్రాజెక్ట్ కనస్ట్రక్షన్ కార్పొరేషన్
5. టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్
6. నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
7. కామరాజ్ పోర్ట్ లిమిటెడ్
8. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మోదీ హయాంలో ఉపసంహరణ ప్రక్రియ మొదలైన మరికొన్నిసంస్థలు:
1. ప్రాజెక్ట్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్
2. ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్
3. బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ ఇండియా లిమిటడ్
4. హిందుస్థాన్ న్యూస్‌ప్రింట్ లిమిటెడ్
6. స్కూటర్స్ ఇండియా లిమిటెడ్
7. భారత్ పంప్స్, కంప్రెషర్స్ లిమిటెడ్
8. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
9. హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్
10. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
11. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్
12. ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్
13. నగర్నార్ స్టీల్ ప్లాంట్ (ఎన్‌ఎండీసీ కి చెందినది)
14. సెయిల్ ఆధ్వర్యంలోని దుర్గాపూర్, భద్రావతి, సేలం, అల్లాయ్ స్టీల్ ప్లాంట్లు
15. పవన్ హన్స్ లిమిటెడ్
16. హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్
17. ఎయిర్ ఇండియా, దాని 5 అనుబంధ సంస్థలు
18. ఇండియన్ మెడిసిన్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్
19. భారత పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన వివిధ యూనిట్లు
20. కర్నాటక యాంటీబయాటిక్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్
21. హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్
22. బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్
23. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
24. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
25. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
26. నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్
27. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్)
కేవం నాలుగు రంగాలలో మాత్రమే పరిమిత స్థాయిలో ప్రభుత్వ వాటాలు కొనసాగుతాయని చెబుతున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అణు ఇంధనం, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్తు, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు, బ్యాంకింగ్, భీమా, ఆర్ధిక సేవలు వంటి వాటిలో మాత్రమే ప్రభుత్వ వాటా వుంటుందని ప్రధాన మంత్రి పలు సందర్భాలలో కుండబద్దలు కొట్టారు. అసలు వ్యాపారం సర్కారు పని కాదని ప్రధాని మోదీ పదే పదే చెబుతున్నారు. వ్యూహాత్మకమైన నాలుగు రంగాలలో తప్ప మిగిలిన అన్ని పీఎస్‌యూలు ప్రైవేటుకేనని అంటున్నారు. ఇందులో సెంటిమెంట్లకు తావులేదని తేల్చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఖజానాకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ALSO READ: ఒక్క నినాదం.. బెంగాల్ ఎన్నికలను కుదిపేస్తోంది.. ఎవరి నోట విన్నా అదే మాట.. ఇంతకీ ఏంటది?