Minister Harish Rao: పోలవరం విస్తరణతో తెలంగాణకు నష్టం.. కేంద్రమంత్రికి వినతిపత్రం ఇచ్చిన మంత్రి హరీష్ రావు..

50వ జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్రమంత్రి గజేంద్రషింగ్‌ షెకావత్‌ను కలిశారు. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల వాటాలు తేల్చేందుకు కొత్త కృష్ణా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టును విస్తరించడం వల్ల గోదావరి నీటిలో..

Minister Harish Rao: పోలవరం విస్తరణతో తెలంగాణకు నష్టం.. కేంద్రమంత్రికి వినతిపత్రం ఇచ్చిన మంత్రి  హరీష్ రావు..
Harish Rao

Updated on: Jul 12, 2023 | 9:00 AM

తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. 50వ జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్రమంత్రి గజేంద్రషింగ్‌ షెకావత్‌ను కలిశారు. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల వాటాలు తేల్చేందుకు కొత్త కృష్ణా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టును విస్తరించడం వల్ల గోదావరి నీటిలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మంత్రి హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. వరదనీటిని ఉపయోగించుకునే పేరుతో ప్రాజెక్టు నిర్మాణంలో వివిధ కాంపోనెంట్లను ఏపీ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా విస్తరిస్తోందని తెలిపారు.అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం సుజల స్రవంతి, వెంకటనగరం ప్రాజెక్టులతో పాటు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, గోదావరి-పెన్నా లింక్ వంటి ప్రాజెక్టులను చేపట్టిందని కేంద్రమంత్రికి ఇచ్చిన లేఖలో హరీష్‌రావు ఆరోపించారు.

అటు, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసిన మంత్రి హరీష్‌రావు…ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ సెస్‌ 700 కోట్ల రూపాయలు, జీఎస్టీ పెండింగ్‌ బిల్లులు 120 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కౌన్సిల్‌ మీటింగ్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు హరీష్‌రావు తెలిపారు.

మొత్తానికి రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు విస్తరణతో నష్టం, మనీలాండరింగ్‌ యాక్ట్‌లోకి జీఎస్టీని తీసుకురావడం వంటి అంశాలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు మంత్రి హరీష్‌రావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం