Meghalaya murder case: సోనమ్‌ కళ్లముందే రాజా రఘువంశీ దారుణ హత్య.. కేసులో కీలక ఆధారం అదే

సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో రఘువంశీ భార్య సోనమ్‌ని షిల్లాంగ్‌ పోలీసులు విచారిస్తున్నారు. తననెవరో కిడ్నాప్‌ చేశారని సోనమ్‌ చెప్పిందంతా అబద్దమని తేలిపోయింది. భర్త హత్యకేసులో ఆమెదే కీలకపాత్రని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మేఘాలయ చిరపుంజి సమీపంలోని ఓ లోయలో ఈ నెల 2న కుళ్లిపోయిన స్థితిలో రఘువంశీ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనలో సోనమ్‌తో పాటు ఆమె ప్రియుడు రాజ్‌ కుష్వాహా, హత్యలో పాల్గొన్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Meghalaya murder case: సోనమ్‌ కళ్లముందే రాజా రఘువంశీ దారుణ హత్య.. కేసులో కీలక ఆధారం అదే
Sonam Raja Raghuvanshi

Updated on: Jun 11, 2025 | 7:25 AM

కిరాయి మూకతో పథకం ప్రకారం భర్తని చంపించిన సోనమ్‌ని ఓ పదునైన ఆయుధం పట్టించింది. తలపై పదునైన ఆయుధంతో రెండుసార్లు కొట్టినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. ఇలాంటి ఆయుధాన్ని సాధారణంగా మేఘాలయలో ఉపయోగించకపోవటంతో ఇది బయటివారి పనేనని పోలీసులు అనుమానించారు. ఆ దిశగానే ఎంక్వైరీ చేశారు. సుపారీ తీసుకున్న వ్యక్తుల్లో ఒకరితో హత్యకు ముందు సోనమ్‌ మాట్లాడినట్లు గుర్తించారు. అదృశ్యం కావడానికి ముందు సోనమ్‌తో పాటు నిందితులు ఒకేచోట ఉన్నట్లు సెల్‌ఫోన్‌ లొకేషన్లతో నిర్ధారించుకున్నారు షిల్లాంగ్‌ పోలీసులు.

సోనమ్‌ కళ్లముందే ఆమె భర్త రఘువంశీని దారుణంగా హతమార్చారు. భర్త మృతదేహాన్ని లోయలోకి విసిరేసేందుకు నిందితులకు సోనమ్‌ సహకరించింది. కిరాయి హంతకులకు సోనమ్‌ మొదట 4 లక్షలు ఆఫర్‌ చేసింది. తర్వాత ఆ మొత్తాన్ని 20 లక్షలకు పెంచింది. భర్త హత్య కోసం సోనమ్‌ అడ్వాన్స్‌గా 50వేల రూపాయలు తన ప్రియుడు రాజ్‌కుష్వాహాకి ఇచ్చింది. రఘువంశీ దంపతులు హనీమూన్‌కి బయలుదేరడానికి ముందే ముగ్గురు నిందితులు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో గౌహతికి చేరుకున్నారు.

రఘువంశీ హత్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ, బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌. సోనమ్‌ ఘాతుకం ఎంతో మూర్ఖమైన చర్యన్నారు కంగనా. తల్లిదండ్రులకు పెళ్లి వద్దని చెప్పడానికి భయపడిన ఒక మహిళ సుపారీ ఇచ్చి మరీ క్రూరమైన హత్య చేయించింది. ఇలాంటి మూర్ఖులను తేలిగ్గా తీసుకోవద్దు. వీరు సమాజానికి అత్యంత ప్రమాదకారులు. జాగ్రత్తగా ఉండండి అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టారు కంగనా.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…