
ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎస్.సి.బి మెడికల్ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ట్రామాకేర్ ఐసీయూ విభాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఆసుపత్రిలోని ట్రామాకేర్ బ్లాక్‌లో ఉన్న ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షణాల్లోనే మంటలు ఐసీయూ అంతటా వ్యాపించడంతో పాటు దట్టమైన పొగ కమ్మేసింది. ఆ సమయంలో ఐసీయూలో వెంటిలేటర్లపై ఉన్న రోగులు బయటకు రాలేక, ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సుమారు 15 మంది రోగులను సురక్షితంగా బయటకు తరలించారు. అయితే రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న కొందరు సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది కూడా దట్టమైన పొగ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం గాయపడిన వారందరికీ అదే ఆసుపత్రిలోని మరో విభాగంలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం, ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అగ్నిమాపక నిబంధనల అమలులో ఏవైనా లోపాలు ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలోనే అతిపెద్ద ఆసుపత్రిలో ఇలాంటి ప్రమాదం జరగడంతో రోగుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బాధితులకు అవసరమైన సాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
Odisha Chief Minister Mohan Charan Majhi visited S.C.B. Medical College and Hospital in Cuttack this morning and held a discussion with the hospital authorities and Police officers. A fire broke out in the Trauma Care ICU here.
(Pics: Odisha CMO) https://t.co/o3FurMyuwV pic.twitter.com/auguQlaQbS
— ANI (@ANI) March 16, 2026