జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో పలు బాణాసంచా దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేకపోవడం ఉపశమనం కలిగించే అంశం. బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. ఈ మేరకు ఓ పోలీసు అధికారి సమాచారం అందించారు.
బొకారో స్టీల్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్గా బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఐదు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. చాలా కష్టపడి మంటలను అదుపు చేయగలిగారు. సమాచారం ప్రకారం అగ్నిప్రమాదం కారణంగా గర్గా వంతెనకు ఇరువైపులా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంటలు చెలరేగడంతో దుకాణదారులు అక్కడ పరుగులు తీశారు.
దుకాణంలో ఏర్పడిన మంటలు చాలా భయంకరమైనవిగా.. చాలా దూరం నుంచి మంటలు కనిపించాయని చెబుతున్నారు. మంటల కారణంగా ఆకాశంలో పొగలు కమ్ముకున్నాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
ఈ ఘటనపై బొకారో సిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ రంజన్ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో 13-14 బాణాసంచా దుకాణాలు కాలి బూడిదయ్యాయని చెప్పారు. అంతేకాదు జిల్లా యంత్రాంగం పటాకుల దుకాణాల ఏర్పాటుకు దుకాణదారులకు తాత్కాలిక అనుమతులు ఇచ్చిందని తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చామని కేసు దర్యాప్తు చేస్తున్నామని రంజన్ తెలిపారు.
అగ్ని ప్రమాదంపై దుకాణదారులు మాట్లాడుతూ.. ఈ ఘటనలో తమకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటన అనంతరం బొకారోలోని బీజేపీ ఎమ్మెల్యే బిరంచి నారాయణ్ సంఘటనా స్థలానికి చేరుకుని జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక శాఖ చురుగ్గా పని చేసి ఉంటే ఇటువంటి ఘటన జరిగేది కాదని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..