ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బిహార్‌లోని డిఘా- సోనేపుర్ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ గంగా నదిపై ఆరు లేన్ల వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 3064 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెనను 4.56 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వంతెన నిర్మాణంతో ట్రాఫిక్ వేగంగా కదలడంతో పాటు బిహార్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది.
త్రిపురలోని ఖోవాయి-హరీనా రహదారిని 135 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2,486.78 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ రహదారిని విస్తరిస్తారు. ఈ ప్రాజెక్టు వల్ల త్రిపురలో రోడ్డు కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2024 కాలానికి గత సీజన్ కంటే మిల్లింగ్ కొబ్బరి క్వింటాల్‌కు 300 రూపాయలు; గుండ్రని కొబ్బరికి 250 రూపాయల చొప్పున పెంచాలని నిర్ణయించారు. దీంతో ఎండు కొబ్బరి మిల్లింగ్ క్వింటాల్ ధర 11,160 రూపాయలు, గుండ్రని ఎండుకొబ్బరి ధర రూ.12వేలకు చేరనుంది.
మరోవైపు న్యూజిలాండ్‌లో అధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు నివసించే ఆక్లాండ్ నగరంలో త్వరలో కాన్సులేట్ జనరల్‌ను ప్రారంభించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఏడాదిలోగా కాన్సులేట్‌ను ప్రారంభించి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..