PM Modi: ‘మత్తు’పై యుద్ధం చేద్దాం.. దేశంలో పెరిగిపోతున్న డ్రగ్ కల్చర్‌పై ప్రధాని మోదీ అసహనం..

|

Jul 28, 2024 | 9:16 PM

డ్రగ్స్‌ మహమ్మారిపై సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు ప్రధాని మోదీ. దేశంలో పెరిగిపోతున్న డ్రగ్ కల్చర్‌పై అసహనం వ్యక్తం చేశారు. మన్ కీ బాత్‌లో మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రత్యేకంగా ప్రస్తావన తీసుకొచ్చిన ప్రధాని మోదీ.. మానస్ హెల్ప్‌లైన్‌ ద్వారా డ్రగ్స్‌పై యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు.

PM Modi: మత్తుపై యుద్ధం చేద్దాం.. దేశంలో పెరిగిపోతున్న డ్రగ్ కల్చర్‌పై ప్రధాని మోదీ అసహనం..
Pm Modi
Follow us on

డ్రగ్స్.. ఫలానా చోటే దొరుకుతుందనేం లేదు. గ్రామాలకు సైతం విస్తరించిందిప్పుడు. కేవలం ఓ వర్గం వాళ్లే తీసుకుంటున్నారడానికీ వీల్లేదు. అబ్బాయిలు, అమ్మాయిలు.. చివరికి విద్యార్ధులను సైతం ఆ ఊబిలోకి దింపేసింది డ్రగ్స్. సో, అందుగలదుఇందులేదనే సందేహమే వద్దు. ఎందెందు వెదికినా కనిపిస్తూనే ఉందిప్పుడు. మొన్ననే.. తిరుపతిలో న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్ధులు గంజాయికి బానిసయ్యారు. ఏది చేస్తే నేరమో, ఏం చేస్తే జైల్లో పెడతారో, ఏం చేస్తే సమాజంలో పరువు పోతుందో బాగా తెలిసిన ‘లా’ స్టూడెంట్స్‌ సైతం మత్తుకు బానిసలుగా మారారు. ఈమధ్య మెడిసిన్‌ చదువుతున్న వాళ్లు కూడా ‘డ్రగ్స్‌’ రైడ్స్‌లో పట్టుబడ్డారు. ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును సర్వనాశనం చేస్తుందని తెలిసినా.. ఆ ఉచ్చులో పడిపోతున్నారు. ఏం అనాలి వీళ్లనసలు. కొన్ని ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లో చదువుతున్న కొందరు విద్యార్ధులు కూడా డ్రగ్స్‌ ఊబిలో చిక్కుకుపోయారు. కేవలం పెద్దపెద్ద స్కూళ్లలోనే అనుకుంటే పొరపాటే. గంజాయి చాక్లెట్లకు గవర్నమెంట్‌ స్కూల్లో చదువుతున్న విద్యార్ధులు కూడా బానిసలైన హిస్టరీ ఉంది. సో, డ్రగ్స్ మహమ్మారి కొందరికే పరిమితం అని చెప్పడానికి లేదు. యువత అయితే.. డ్రగ్స్‌ గుప్పెట్లోంచి బయటపడలేకపోతోంది. డ్రగ్స్‌ ఉన్నా, తీసుకున్నా నేరమే. సరే.. నేరం గురించి పక్కనపెడదాం. యువ వయసులో డ్రగ్స్‌ తీసుకుంటే.. మున్ముందు ఎందుకూ పనికిరాకుండా పోతారు. యువత నిర్వీర్యం అయితే.. దేశానికే ప్రమాదం. అయినా సరే.. డ్రగ్స్‌కు దాసోహం అవుతున్నారు. ఇక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లయితే రోజుకొకరు చొప్పున పట్టుబడుతున్నారనే చెప్పాలి. ఇక్కడ యువత, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లంటే కేవలం మగాళ్లే కాదు ఆడవాళ్లు సైతం డ్రగ్స్‌ మత్తులో చిత్తవుతున్నారు. సినిమా రంగమైతే డ్రగ్స్‌ విషయంలో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటూ వస్తోంది.

అందుకే, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిస్తున్నారు ప్రధాని మోదీ. మన్‌ కీ బాత్‌లో భాగంగా డ్రగ్స్‌ నిర్మూలనపై మాట్లాడారు. మత్తు మహమ్మారిని నిర్మూలించేందుకు మానస్ హెల్ప్ లైన్ వినయోగించుకోవాలని దేశ ప్రజలను కోరారు. డ్రగ్స్ సరఫరా, వినియోగం గురించి ఎవరైనా సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు చెప్పాలని రిక్వెస్ట్ చేశారు. భారతదేశాన్ని డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా మార్చే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పాల్గొనాలని కోరారు. డ్రగ్స్‌ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, చదువు, ఉద్యోగం సమాజంపైన ప్రభావం చూపుతుంది. జీవితంలో అతిపెద్ద నష్టాన్ని మిగుల్చుతుంది. అందుకే, మానస్‌ హెల్ప్‌లైన్‌ను ఉపయోగించుకోవాలని చెబుతున్నారు ప్రధాని మోదీ.

వీడియో చూడండి..

1933.. ఇదే మానస్‌ హెల్ప్‌లైన్. అసలేంటీ మానస్ హెల్ప్‌లైన్..? డ్రగ్స్‌ మహమ్మారి నుంచి బయటపడదామనుకున్న వారికి సహాయకారిగా ఉంటుందీ టోల్‌-ఫ్రీ హెల్ప్‌లైన్‌ సెంటర్. ఇందులో రీహాబిలిటేషన్‌ ఫెసిలిటీ కూడా అందిస్తారు. అంతేకాదు, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని, డ్రగ్స్‌ సరఫరాను నియంత్రించడానికి కూడా మానస్‌ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవచ్చు. డ్రగ్స్‌ నిర్మూలన కోసం భారత ప్రభుత్వం పెద్ద పోరాటమే చేస్తోంది. కాని, మార్పు సమాజం నుంచి కూడా రావాలి. సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘మానస్’ హెల్ప్‌లైన్ తీసుకొచ్చినట్టు చెప్పారు ప్రధాని మోదీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..