AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మసాలా పొడిని డ్రగ్స్ అనుకున్న అధికారులు.. పాపం 57 రోజుల జైలు..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ విమానాశ్రయంలో మసాలా పొడి ప్యాకెట్లను మాదక ద్రవ్యాలుగా పొరబడటంతో ఓ వ్యాపారి 57 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆమ్‌చూర్, గరం మసాలా ప్యాకెట్లపై స్కానింగ్ యంత్రం హెచ్చరికలు ఇవ్వడంతో అధికారులు అతడిపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేశారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల్లో అవి కేవలం మసాలా దినుసులేనని తేలడంతో హైకోర్టు బాధితుడికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

మసాలా పొడిని డ్రగ్స్ అనుకున్న అధికారులు.. పాపం 57 రోజుల జైలు..
Spice Packets Case
Vijay Saatha
| Edited By: |

Updated on: May 25, 2026 | 8:15 PM

Share

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ విమానాశ్రయంలో కేవలం మసాలా పొడి ప్యాకెట్ల కారణంగా ఓ వ్యాపారి ఏకంగా 57 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ కేసుపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అసలు నిజాలు బయటపడ్డాయి. రెండు వేల పది మే 7న అజయ్ సింగ్ అనే వ్యాపారి భోపాల్ నుంచి ఢిల్లీ మీదుగా మలేషియా వెళ్లేందుకు జెట్ ఎయిర్‌వేస్ విమానం ఎక్కడానికి విమానాశ్రయానికి చేరుకున్నాడు. భద్రతా తనిఖీల సమయంలో అతడి బ్యాగేజీని స్కానింగ్ యంత్రాలతో పరిశీలించారు. ఈ సమయంలో బ్యాగులో ఉన్న ఆమ్‌చూర్, గరం మసాలా ప్యాకెట్లపై స్కానింగ్ యంత్రం ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.

దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఆ ప్యాకెట్లలో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయని అనుమానించారు. హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు ఉన్నాయనే ఆరోపణలతో అజయ్ సింగ్‌ను వెంటనే అదుపులోకి తీసుకుని, ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. తన దగ్గర ఉన్నవి కేవలం వంటకు ఉపయోగించే మసాలా దినుసులేనని అతడు చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. స్వాధీనం చేసుకున్న మసాలా ప్యాకెట్లను పరీక్షల కోసం భోపాల్ ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అయితే, ఆ పదార్థాలను శాస్త్రీయంగా పరీక్షించే సదుపాయాలు తమ వద్ద లేవని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో నమూనాలను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆ ప్యాకెట్లలో ఎలాంటి నిషేధిత మాదక ద్రవ్యాలు లేవని స్పష్టమైంది.

అయితే అప్పటికే అమాయకుడైన అజయ్ సింగ్ 57 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాడు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా తప్పుడు అని తేలడంతో, జూలై 2, 2010న అతడు నిర్దోషిగా విడుదలయ్యాడు. తనకు జరిగిన అవమానం, మానసిక వేదనపై అతడు కోర్టును ఆశ్రయించాడు. విచారణలో విదేశీ స్కానింగ్ యంత్రాలకు భారతీయ సుగంధ ద్రవ్యాలను సరిగ్గా గుర్తించే సామర్థ్యం లేకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగిందని వెల్లడైంది. ఈ కేసును విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ ఖోట్, రాష్ట్రంలో సరైన ఫోరెన్సిక్ సదుపాయాలు లేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

కేవలం యంత్రం ఇచ్చిన హెచ్చరిక ఆధారంగా, సరైన పరీక్షలు చేయకుండా ఓ వ్యక్తిని సుదీర్ఘకాలం జైలులో ఉంచడం ఏమాత్రం సమర్థనీయం కాదని కోర్టు స్పష్టం చేసింది. బాధితుడికి జరిగిన నష్టానికి పరిహారంగా పది లక్షల రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు.. రాష్ట్రంలోని అన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌లను నెలరోజుల్లో తనిఖీ చేసి, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి నిర్లక్ష్యాల వల్ల అమాయకుల ప్రాథమిక హక్కులు దెబ్బతినకూడదని ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది.

Follow Us