30 ఏళ్ల క్రితం ఉద్యోగం పేరిట రూ.200 పుచ్చుకుని పరార్‌.. ఇన్నాళ్లకు అరెస్ట్!

ప్రభుత్వ సంస్థల్లో పెద్దపెద్దొళ్లు తనకు తెలుసని ఓ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడో పెద్ద మనిషి. ఆనక సదరు యువకుడి వద్ద రూ.200 తీసుకున్నాడు. అయితే తనకు ఉద్యోగం వస్తుందని ఎదురు చూపిన యువకుడికి ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి పిలుపూ రాలేదు. దీంతో సదరు పెద్ద మనిషిని నిలదీయగా పత్తాలేకుండా పారిపోయాడు. అప్పట్లో అతడిపై చీటింగ్ కేసు కూడా నమోదైంది. అప్పట్నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న కేటుగాడు ఇన్నాళ్లకు..

30 ఏళ్ల క్రితం ఉద్యోగం పేరిట రూ.200 పుచ్చుకుని పరార్‌.. ఇన్నాళ్లకు అరెస్ట్!
Man Arrested After 30 Years For Cheating

Updated on: Jul 08, 2025 | 1:11 PM

కార్వార్, జూలై 7: సరిగ్గా 30 ఏళ్ల క్రితం అంటే ఫిబ్రవరి18, 1995న కర్నాటకలోని సిర్సి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో తాలూకాలోని ఉంచల్లికి చెందిన వెంకటేష్ మహాదేవ వైద్య అనే వ్యక్తి కేసు నమోదు చేశాడు. అందులో బి. కేశవమూర్తి రావు అనే వ్యక్తి వెంకటేష్ నుంచి రూ. 200 తీసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదులో తెలిపాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద పెద్దవాళ్లు తెలుసని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద డబ్బు తీసుకున్నాడనీ.. కానీ రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో నిరాశ చెందిన వెంకటేష్.. కేశవమూర్తి రావును నిలదీశాడు. తనకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని, ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని కోరాడు. కానీ అతడు డబ్బు ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం అతడిపై చీటింక్‌ కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు నిందితుడు బికె రావును అరెస్ట్ చేయలేకపోయారు. అప్పటి నుంచి గాలిస్తుంటే.. తాజాగా ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సిలో ఓ సంస్థ లీడర్‌ని అని చెప్పుకుంటూ తిరుగుతున్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేసి జైల్లో వేశారు.

30 ఏళ్ల నాటి కేసు ఇప్పుడు ఎలా బయటపడిందంటే?

ఇటీవల సిర్సి రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీపీఐగా పనిచేస్తున్న మంజునాథ గౌడ, పెండింగ్ కేసుల జాబితాను పరిశీలిస్తుండగా 30 ఏళ్ల నాటి కేసు ఆయన కంట పడింది. ఈ కేసులో ఉన్న వ్యక్తి బీకే రావు కుందాపూర్‌కు చెందినవాడని తెలుసుకున్నాడు. ఈ కేసును తిరిగి దర్యాప్తు మొదలుపెట్టగా కుందాపూర్ పోలీసుల నుంచి సమాచారం అందింది. ప్రస్తుతం ఉడిపి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సిర్సి రూరల్ పోలీస్ స్టేషన్ CPI మంజునాథ గౌడ మళ్ళీ కేసును తిరగతోడాడు. ఆయన BK రావు గురించి ఆరా తీయగా.. నిందితుడు బెంగళూరులో ఉన్నట్లు సమాచారం అందింది. నిందితుడు బికె రావు మొబైల్ నంబర్ కూడా తీసుకొని అతన్ని సంప్రదించారు.

నిందితుడిని ఎలా పట్టుకున్నారంటే?

బెంగళూరులో జరిగిన వార్షిక క్రీడా సమావేశానికి వెళ్లిన సీపీఐ మంజునాథ గౌడ, నిందితుడు బీకే రావు తనను సంప్రదించాడని సిర్సి రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతన్ని సిర్సికి తీసుకువచ్చి కోర్టు ముందు హాజరుపరిచారు. 30 ఏళ్ల క్రితం రూ.200 విలువ నేడు రూ.లక్ష కంటే ఎక్కువగా ఉండవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బు తీసుకుని పరారైన వ్యక్తిని చివరకు అరెస్టు చేశారు. నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసు సూపరింటెండెంట్ ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.