
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 227 వార్డులకు 1,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5.30 వరకు జరగనుంది. రేపు ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. 100 శాతం పోలింగ్ కోసం సెలబ్రేటీలు మేము సైతం అంటూ.. ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుటుంబ సమేతంగా తరలివచ్చి ఓటు వేశారు. అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నాతోపాటు.. మహిళలు, వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం కోటి మూడు లక్షలకుపైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముంబై పోలీసులు 25వేల మందికి పైగా సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని మహా యుతి కూటమి ఓవైపు.. ఉద్ధవ్ థాకరే, రాజ్‌ఠాక్రే, శరద్‌పవార్ ఎన్సీపీ కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ వేరే కూటమి నుంచి పోటీ చేస్తోంది. పోలింగ్ ముగిసిన అనంతరం రేపు, జనవరి 16వ ఉదయం 10 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
మున్సిపల్ ఎన్నికల సమయంలో నవీ ముంబైలోని ఖార్ఘర్ సెక్టార్ 20లో డబ్బుతో నిండిన సంచులు లభ్యం కావడం కలకలం రేపింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడానికి ఈ సంచులను తీసుకువచ్చారని అనుమానిస్తున్నారు. ఖార్ఘర్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేయలేదు. ఆ డబ్బు ఏ పార్టీకి చెందినదో ఇంకా వెల్లడి కాలేదు, కాబట్టి పేరున్న కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లకూ ఎన్నికలు జరుగుతున్నాయి. పుణె, నాగపూర్, థానే, నవీ ముంబై వంటి ప్రధాన కార్పొరేషన్లలో తీవ్ర పోటీ నెలకొని ఉంది. 2869 సీట్లలో 68 సీట్లు ఏకగ్రీవమయ్యాయి. ప్రధానంగా అధికార పార్టీలకు చెందిన నేతలే ఉన్నారు. ఫస్ట్ టైమ్ ఓటు వేస్తున్న జెన్ జీ ఓటర్లను ఆకట్టుకునేలా ఎన్నికల సంఘం వివిధ రకాల క్యాంపేన్లు రన్ చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..