Maharashtra Corona: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్.. నిర్లక్ష్యంతోనే విజృంభణ: కేంద్రం

|

Mar 16, 2021 | 2:53 PM

Maharashtra: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలాది కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ..

Maharashtra Corona: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్.. నిర్లక్ష్యంతోనే విజృంభణ: కేంద్రం
Follow us on

Maharashtra: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలాది కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్డౌన్‌ను ప్రకటించి.. కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. అయితే మహారాష్ట్రలో విచ్చలవిడిగా కేసులు నమోదు కావడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్రలో కరోనా రెండో దశ ప్రారంభంలో ఉందని, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే రాష్ట్రంలో వైరస్‌ కొరలు చాస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతవారం కేంద్ర నిపుణుల బృందం రాష్ట్రంలో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించింది. ఈ బృందం అందజేసిన నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రెండో దశ ప్రారంభంలో ఉందని ప్రభుత్వం పేర్కొంది. పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో కాంటాక్ట్‌ అయినవారిని గుర్తించడం, వారిని క్వారంటైన్‌లో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు అంతంతమాత్రంగానే ఉన్నాయంటూ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని ప్రజలు కరోనా నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. వైరస్‌ వ్యాప్తి పరిస్థితులపై జిల్లా యంత్రాంగాల్లో, ఇటు ప్రభుత్వంలో ఎలాంటి ఆందోళన కన్పించట్లేదని కేంద్ర బృందం గుర్తించింది. ఇప్పటికే చాలా చర్యలు చేపట్టామన్న భావనలో అధికార యంత్రాంగం ఉందని.. ఈ పరిణామాలే కేసుల పెరుగుదలకు దారితీశాయంటూ వెల్లడించింది.

మహారాష్ట్రలో గత నాలుగు రోజులుగా 15 వేలకు పైనే కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,29,464కు చేరింది. దీంతోపాటు యాక్టివ్ కేసులు కూడా లక్షకు పైగానే ఉన్నాయి.

Also Read: