NDA’s Vice President: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్.. రాజకీయ నేపథ్యం ఇదే..

ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై కసరత్తు ముమ్మరం చేసిన భారతీయ జనతా పార్టీ.. ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది.. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ను బీజీపీ అధిష్టానం ప్రకటించింది. గతంలో కోయంబత్తురు ఎంపీగా పనిచేసిన రాధాకృష్ణన్.. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు.

NDAs Vice President: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్.. రాజకీయ నేపథ్యం ఇదే..
C.P.-Radhakrishnan - PM Modi

Updated on: Aug 17, 2025 | 9:09 PM

ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై కసరత్తు ముమ్మరం చేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ను బీజీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన విడుదల చేశారు. సీపీ రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు.. గతంలో కోయంబత్తురు ఎంపీగా పనిచేసిన రాధాకృష్ణన్.. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఆయన గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు పార్టీ అగ్రనేతలు నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించిన నేతలు సీపీ రాధాకృష్ణన్ ను ఫైనల్ చేశారు.

చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ అక్టోబర్ 20, 1957న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించారు. ఆయన 2003 నుంచి 2006 వరకు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. రాధాకృష్ణన్ తన రాజకీయ ప్రయాణంలో అనేక కీలక పదవులను నిర్వహించారు. ఆయన జూలై 31, 2024న మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు, ఆయన ఫిబ్రవరి 18, 2023 నుండి జూలై 30, 2024 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేశారు. మార్చి నుండి జూలై 2024 వరకు తెలంగాణ గవర్నర్‌గా, మార్చి నుండి ఆగస్టు 2024 వరకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు.

1998, 1999లో కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. బిజెపికి అనుంబంధమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్), భారతీయ జనసంఘ్‌లతో ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.

బిజెపి తమిళనాడు అధ్యక్షుడిగా, రాధాకృష్ణన్ నదుల అనుసంధానం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, అంటరానితనాన్ని నిర్మూలించడం వంటి అంశాలపై దృష్టి సారించి 93 రోజుల రథయాత్రను ప్రారంభించారు. పార్లమెంటులో, ఆయన వస్త్రాలపై స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహించారు.. ఆర్థిక, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అనేక కమిటీలకు ప్రాతినిథ్యం వహించారు.

కాగా.. ఈనెల 19న ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఆ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఈ నెల 21న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..