తుఫానులో చిక్కుకున్న ఉప ముఖ్యమంత్రి హెలికాప్టర్.. ఏక్‌నాథ్ షిండేకు తప్పిన పెను ప్రమాదం!

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. గురువారం కళ్యాణ్ సమీపంలో అకస్మాత్తుగా ఎదురైన ప్రతికూల వాతావరణం, ఉరుములతో కూడిన తుఫాను కారణంగా హెలికాప్టర్ గాలిలో చిక్కుకుపోయింది. పైలట్ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి, హెలికాప్టర్‌ను ముంబైలోని జుహు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

తుఫానులో చిక్కుకున్న ఉప ముఖ్యమంత్రి హెలికాప్టర్.. ఏక్‌నాథ్ షిండేకు తప్పిన పెను ప్రమాదం!
Eknath Shinde Helicopter Caught In Thunderstorm

Updated on: May 07, 2026 | 6:27 PM

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. గురువారం కళ్యాణ్ సమీపంలో అకస్మాత్తుగా ఎదురైన ప్రతికూల వాతావరణం, ఉరుములతో కూడిన తుఫాను కారణంగా హెలికాప్టర్ గాలిలో చిక్కుకుపోయింది. పైలట్ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి, హెలికాప్టర్‌ను ముంబైలోని జుహు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి షిండే కళ్యాణ్ సమీపంలోని ముర్బాద్‌లో జరగబోయే ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ముంబైలోని మహాలక్ష్మి రేస్ కోర్స్ హెలిప్యాడ్ నుండి బయలుదేరారు. ప్రయాణం ప్రారంభంలో వాతావరణం అనుకూలంగానే ఉన్నప్పటికీ, హెలికాప్టర్ కళ్యాణ్ ప్రాంతానికి చేరుకోగానే పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది.

ఆకాశంలో అకస్మాత్తుగా దట్టమైన మేఘాలు కమ్ముకుని, బలమైన గాలులు వీచడం ప్రారంభించాయి. గాలి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయే పరిస్థితి తలెత్తింది. క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో ఏమాత్రం తడబడకుండా, పైలట్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రయాణాన్ని కొనసాగించడం ప్రమాదకరమని భావించి, వెంటనే హెలికాప్టర్‌ను ముంబై వైపు మళ్లించారు. ఆపై జుహు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రితో పాటు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తోపాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్ కాలే, ముఖ్య ప్రజా సంబంధాల అధికారి వినాయక్ పత్రుద్కర్, డిప్యూటీ సీఎం ఓఎస్‌డీ రాజ్‌పుత్, ముఖ్య భద్రతా అధికారి, ఇతర సిబ్బంది ఉన్నారు.

హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. గాలిలో ఉన్నంత సేపు అందరూ ఆందోళన చెందారు, కానీ కిందకు దిగిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. షిండేతో సహా సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు ధృవీకరించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన వాయిదా పడినప్పటికీ, షిండే సురక్షితంగా ఉండటంతో అటు పార్టీ కార్యకర్తలు, ఇటు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పులను గమనించి పైలట్ తీసుకున్న వేగవంతమైన నిర్ణయం ఒక పెద్ద విపత్తును నివారించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us